కమల్‌ హాసన్‌గారిలా సినిమాలు చేయాలనుకుంటున్నా: అజ్మల్‌

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (19:57 IST)
WD
నటుడంటే కేవలం సినిమాల్లో నటిస్తూ, డబ్బు సంపాధించడమే కాదు, సమాజం గురించి కూడా ఆలోచించాలంటున్నాడు యువ కథానాయకుడు రంగం ఫేం అజ్మల్‌. రంగం, రచ్చ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అజ్మల్ తాజాగా 'ప్రభంజనం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భాస్కరరావు వేండ్రాతి దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా అజ్మల్‌తో చిట్‌చాట్‌...

ప్రభంజనం సారాంశమేంటి?
ఓ డాక్టర్‌ రోగికి మందులిచ్చి జబ్బుని నయం చేస్తున్నాడు. ఇంజనీర్‌... బిల్డింగ్‌లు కడుతున్నాడు. మరి నాశనమైపోతున్న సమాజానికి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఓటర్‌ ఎందుకు అమ్ముడుపోతున్నాడు అనే అంశాలతో నేటి సమాజానికి, రాజకీయ వ్యవస్థకి అద్దంపట్టేలా ఈ చిత్రం తెరకెక్కింది. యువత తలుచుకుంటే దేశానికి ఏవిధంగా మంచి చేయగలరు. సమాజాభివృద్ధికి ఎలా తోడ్పడగలరు. ఓటు, ఓటర్‌ ప్రాముఖ్యత ఏంటనేది ఇందులో ప్రస్తావించాం. ఓటు వేసే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. ఇందులో పొలిటికల్‌ సెటైర్‌ ఉంటుంది కానీ ఏ పార్టీని ఉద్ధేశించిన అంశాలు ఉండవు.

మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుంది?
ఐఏఎస్‌ బ్యాగ్రౌండ్‌తో కూడిన మూడు జనరేషన్ల కథ ఇది. ఆ ఫ్యామిలీలో నేను ఒకడిని. కెరియర్‌ గురించి ప్లానింగ్‌ లేకుండా, తల్లిదండ్రులు చెప్పింది వినని ఓ కుర్రాడిగా నటించాను. తరువాత పరిస్థితులను బట్టి మారి సమాజం పట్ల బాధ్యతగల సిటిజన్‌గా కనిపిస్తాను. డిఫరెంట్‌ షేడ్సులో నా పాత్ర ఉంటుంది. గత పాత్రలతో కంపేర్‌ చేస్తే నాకు బాగా గుర్తింపు తెచ్చే పాత్ర అవుతుంది.

అసలు ఈ సినిమా ఎలా సెట్స్‌ మీదకెళ్ళింది?
అదంతా భాస్కరరావుగారి కృషి. ఆయన చాలాకాలంగా ఈ కథ మీద వర్క్‌ చేశారట. తరువాత వారి మిత్రులతో, ఆర్‌.పి గారితో కూర్చుని కథను ఫైనల్‌ చేసి సెట్స్‌ మీదకి తీసుకొచ్చారు. చిత్రీకరణ పట్ల ఆయనకున్న క్లారిటీ నాకు బాగా నచ్చింది. నటీనటుల నుండి చక్కని నటనను రాబట్టుకున్నారు. హోల్‌ అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం అందుకే ఈ రోజే(బుధవారం) ప్రిమియర్‌ షో వేస్తున్నాం.

రంగంలో కూడా ఇదే తరహా పాత్ర చేశారు. ఈ సినిమాలో కూడా అలాగే చేయడానికి కారణం?
నేనేప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటాను. ఈ కథ డిమాండ్‌ను బట్టి ఈ పాత్ర చేశాను. దీంతో రంగం సినిమా కన్నా నాకు మంచి పేరొస్తుంది. ఇప్పటి వరకు తమిళ్‌, మలయాళం చిత్రాల్లో నటించాను. అలాగే తెలుగులో కూడా చేస్తున్నాను. వాటికే పరిమితం కాను. ఇప్పుడు తెలుగు కథల మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌ పెడుతున్నాను.

మంచి కథ ఉంటే ఏ లాంగ్వేజ్‌ అయినా యాక్ట్‌ చేయడానికి రెడీగా ఉన్నాను. కమల్‌ హాసన్‌ గారు చాలా భాషల్లో యాక్ట్‌ చేశారు. ఆయనలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్‌ సినిమాలు కాకుండా స్క్రిప్ట్‌ ఓరియెంటెడ్‌ కథలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను.

తదుపరి చిత్రాలు?
వంశీగారి దర్శకత్వంలో తను మొన్నే వెళ్లిపోయింది చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉండి. మే చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని ముగించారు.

వెబ్దునియా పై చదవండి