ముగ్గురు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉంటే బజారుది అంటాం... లక్ష్మీ మంచు ఇంటర్వ్యూ

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (20:52 IST)
WD
చందమామ కథలు చిత్రంలో మందు, సిగరెట్ తాగుతున్నట్లు కనిపించి చర్చకు తెరతీసిన మంచు లక్ష్మితో ఇంటర్వ్యూ విశేషాలు...

చందమామ కథలు సినిమా గురించి చెప్పండి?

నేను మా ఆఫీసులోనే కథ విన్నాను. విన్న వెంటనే డేట్స్‌ ఇచ్చేశాను. నటిగా చాలెంజింగ్‌ రోల్‌ అది. ఎప్పుడూ చేసిన పాత్రే చేయడం ఇష్టం ఉండదు. నాన్నకు పోటీగా చేయాలని ఉండేది. ఇప్పటివరకు ప్రేక్షకులు నన్ను ఆర్టిస్టుగా గుర్తించారు. దాంతో ధైర్యం వచ్చింది. మోహన్‌ బాబు కూతురుగా కాకుండా నటిగా చేశాను. చాలా బోల్డ్‌గా ఉంటాను. బూతులు మాట్లాడటం, మందు కొట్టడం, సిగరెట్‌ తాగడం వంటివన్నీ చేసేశాను.

కథ విన్నప్పుడు హార్ట్‌ టచింగ్‌గా ఉంది. తీస్తే ఇలాంటి సినిమా తీయాలనుకునే దానిని. ఇటువంటి సినిమాలో నేను ఓ భాగమైనందుకు గర్వంగానూ గౌరవంగానూ కూడా ఉంది. నాకు ఈ పాత్ర హిస్టరీగా మిగిలిపోతుంది.

ఈ టీమ్‌లో చైతన్యకృష్ణ ఉన్నాడు. తను గూగుల్‌ ప్లేస్‌ స్టోర్‌లో 'చందమామ కథలు' పేరుతో యాడ్‌ క్రియేట్‌ చేశాడు. అందులో ఎవరికి ఏం నచ్చిందో దాని గురించి వివరంగా రాయవచ్చు. మీ వ్యూస్‌ అందులో పొందుపర్చవచ్చు. కొంతమందికి కొన్ని నచ్చవచ్చు. మరికొంతమందికి నచ్చకపోవచ్చు. అవన్నీ ఇందులో రాయవచ్చు. ముఖ్యంగా ఇటువంటి సినిమా తీసిన నిర్మాత ధైర్యాన్ని అభినందించాలి. ఎలక్షన్ల టైంలో వస్తున్న ఈ సినిమా మంచిగా ఆడాలనుకుంటున్నాను.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నేను ఓ గ్లామర్‌ మోడల్‌గా నటిస్తున్నాను. ది మోస్ట్‌ గ్లామర్‌ పాత్ర ఐరేంద్రి చేశాను. ఎవ్వరూ చేయలేని పాత్ర అది. ఇందులో రెగ్యులర్‌ గ్లామర్‌ రోల్‌ ఇది.

WD
చందమామ కథలును ఎలా జస్టిఫై చేస్తారు?
చిన్నప్పుడు చందమామ కథలు చదివితే అందులో ఏదో ఒక నీతి ఉంటుంది. ఇది పెద్దవాళ్ళ చందమామ కథలు అనవచ్చు. స్కూల్‌డేస్‌లో 1+1=2 చెబుతారు. కానీ చెక్‌బుక్‌ ఎలా రాయాలో నేర్పించరు. పవిత్రతకు నిదర్శనంగా రాముడు, సీత గురించి చెబుతుంటారు. కానీ రిలేషన్‌షిప్‌ అంటే ఏమిటి? అనేది పెద్దవారు నేర్పించరు. సినిమా అనేది ప్రదానంగా ఎంటర్‌టైనర్‌. దానితోపాటే ఏదైనా చెప్పగలుగుతున్నామా? అనేది కూడా చూసుకోవాలి.

బూతులు తిట్టే గ్లామర్‌ మోడ్రన్‌ ఎంచుకోవడానికి కారణం?
మోడల్‌కున్న ఫ్రస్టేషన్‌ ఇందులో చూపించారు. నటి కానీ, మోడల్‌ కానీ రెగ్యులర్‌ జనాలన్నా ఫ్రీగా ఉంటాం. వేరే పాత్రల ద్వారా అది బయటపడుతుంది. మనుషుల్లో ఉండే పలు కోణాలకుమల్లే మోడల్‌లో కూడా చాలా రకాలున్నారు. కంగనా రనౌత్‌ తొలిదశలోనే ఇలాంటి పాత్రలు పోషించింది. మందు తాగడం, లిప్‌కిస్‌లు ఇవ్వడం చేసేంది. ఇప్పుడు తను వెజిటేరియన్‌గా మారానని ప్రకటించింది.

అలాగే విద్యాబాలన్‌ చరిత్రలో డర్టీపిక్చర్స్‌ అనేది మిగిలిపోతుంది. ఏదైనా ఇచ్చిన పాత్రను పవిత్రంగా చేయడం నేర్చుకోవాలి. దర్శకుడు చెప్పిన కథకు పాత్ర ద్వారా జీవం పోశాను. మొదటిరోజు షూటింగ్‌లో నాచేత బూతులు తిట్టిస్తుంటే.. బీప్‌ సౌండ్‌లు వస్తాయేమో అని చెప్పి.. వినగలిగే తిట్లు ఇవ్వండి అన్నాను. కానీ పాత్ర తీరు అలానే
ఉంటుందన్నారు.

మీ పాత్రకు ఇతర పాత్రలకు లింక్‌ ఉంటుందా?
ఎనిమిది కథలే అయినా ఒక పాయింట్‌లో అందరికీ కనెక్ట్‌ అవుతుంది.

WD
ఈ కథలో బాగా ఎట్రాక్ట్‌ చేసిన పాయింట్‌?
నేను ఇలాంటి సినిమా తీయాలనే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 'ప్లేయింగ్‌ బై హార్ట్‌' అనే ఆంగ్ల సినిమా చూశాను. షాన్‌కాన్‌రనీ, అంజిలాజోనీ.. పాత్రలకు కనెక్ట్‌ అయ్యాను. మహిళకు ఎక్కువగా బోయ్‌ఫ్రెండ్స్‌ ఉంటే అది బజారుది అంటాం. కానీ జీవితంలో తను ఏం కోరుకుంటో ఏమి వస్తుందనేది ఒక్కసారే తెలీదు. అటువంటి పాత్రలను ఇక్కడ ఎడాప్ట్‌ చేయాలనుకున్నాను. ప్రవీణ్‌గారు కథ చెప్పగానే నేను చేయాలనుకున్నాను.

ఇక్కడ కల్చర్‌ను అక్కడ ఎడాప్ట్‌ చేసి చూపించవచ్చుగదా?
మన సంస్కృతి, పద్ధతులకు అక్కడవి విరుద్ధంగా ఉంటాయి. భారతీయుడిగా అమెరికా వెళితే ఇండియాను వదిలి వచ్చేయాలనిపిస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్‌ మూడు రోజులు ఎంజాయ్‌ చేస్తారు. నాల్గవ రోజుకే గిల్టీగా ఫీలవుతారు. ఎందుకంటే అక్కడ టీ తాగాలన్నా వారే పెట్టుకోవాలి. ఇక్కడ మనుషులు ఉంటారు. వారిని బానిసల్లా చూస్తున్నామా? అనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ దానికి పే చేస్తున్నాం కదా అనిపిస్తుంది. మనవీ వారివీ డిఫరెంట్‌ పద్ధతులు. 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రాన్ని అక్కడ బాగానే వీక్షించారు. కానీ 'లంచ్‌బాక్స్‌' చిత్రాన్ని చూడలేదు. ఆ చిత్రాన్ని చూశాక నాకు మతిపోయింది. మన సినిమాలు మన ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలి.

గుండెల్లో గోదారి పాత్రకీ ఈ పాత్రకు ఎంత వ్యత్యాసముంది?
గుండెల్లో గోదారిలో చిత్ర పాత్రకు చందమామ కథలులోని లీసాస్మిత్‌ పాత్రకు పోలికే ఉండదు. నాకు అలాంటి పాత్రే కావాలి. ఒకసారి చేసిన పాత్ర ఒక హీరోయిన్‌ చేసిన పాత్రను చేయాలంటే బోర్‌ కొడుతుంది.

దర్శకత్వం చేసే ఆలోచనుందా?
ఉంది. కానీ భయం కూడా ఉంది. దర్శకత్వం అనేది పెద్ద తలనొప్పి. నిర్మాత పెట్టిన పెట్టుబడికి ఎక్కువ తక్కువ కాకుండా జాగ్రత్తగా తీసిపెట్టాలి. ఎన్నో లిమిటేషన్స్‌ ఉంటాయి.

WD
సిగరెట్టు, మందు కొట్టే సీన్‌కు ఇన్స్‌పిరేషన్‌?
చాలామంది సిగరెట్‌ పట్టుకొనే విధానాన్ని చూశాను. మొదట సిగరెట్టు పట్టుకున్నప్పుడు జంకాను. పక్కకు వెళ్ళి సిగరెట్‌ తాగేవారు ఎలా పట్టుకుంటారనేది పరిశీలించాను. రాంప్‌ వాకింగ్‌ మోడల్స్‌ సిగరెట్లు తాగి బుగ్గలు తగ్గడం కోసం వాడుతుంటారు. ఒక్కోసారి వారికి తినడానికి టైం కూడా ఉండదు. మొదట నేను సిగరెట్‌ కాలిస్తే జుట్టు కాలిపోతుందేమోనని భయపడ్డాను. ఫస్ట్‌ స్మిమ్స్‌ తెచ్చారు. ఆ తర్వాత గోల్డ్‌ఫ్లేక్‌ మార్చారు.

నాకు అది కొద్దిగా పీల్చగానే వాంతి వచ్చినంత పనయింది. ఇలాంటి సిగరెట్లు ఎందుకు తాగుతారో అర్థమయ్యేదికాదు. మళ్ళీ స్లిమ్స్‌ ఇవ్వమని అడిగితే.. ఈ మోడల్‌.. ఇలాంటివే కాలుస్తుంది. ఎందుకంటే ఆమె దగ్గర డబ్బులు లేవు అన్నారు. అలాగే డ్రింకింగ్‌లో అమెరికన్‌ డ్రింకింగ్‌ షార్ట్‌ కొన్ని పరిశీలించాను. ఒకటి నుంచి మూడు పెగ్గులు తాగితే ఎలా ఉంటారనేది ఎక్సర్‌సైజ్‌ చేశాను. నేను చదివిన చదువు ఎక్కడా వేస్ట్‌ కాలేదనిపించింది.

మీ పాత్రను మోహన్‌ బాబు గారు చూశారా?
ఇంకా చూపించలేదు. పేపర్లలో న్యూస్‌ చదివారు. మమ్మీ, బ్రదర్స్‌ మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. నాన్నగారు చూసేంతవరకే. చూశాక ఏమైనా అంటే... ఆర్టిస్టుగా భిన్నంగా ఉండాలని మీరే చెప్పారు గదా అని అనేస్తా.

చిన్నపాత్రలో చేయడం ఎలా అనిపించింది?
నేను మంచి సినిమాలో పార్ట్‌ అయినందుకు ఆనందంగా ఉంది. మంచి సినిమాలో పాత్ర ఎంత అనేది ముఖ్యంకాదు. సీన్‌ ఒక్కటయినా గుర్తిండిపోయేట్లుగా ఉండాలి.

సినిమాలు ఎక్కువగా చేయకపోవడానికి కారణం?
ఇప్పటివరకు చాలా సినిమాలు ఉచితంగా చేసేశాను. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి కదా.. అందుకనే మనీ తీసుకుంటున్నాను. అందుకే నాకు వచ్చిన పాత్రలే చేస్తున్నాను.

ఒకవైపు టీవీషోలు, మరోవైపు సినిమాలు ఎలా ఉంది లైఫ్‌?
ఎక్కడున్నా ఒకేలా ఉంటాను. ప్రస్తుతం 'దూసుకెళ్తా' షో జరుగుతోంది. ఇంకా రెండు షోలు కూడా ఉన్నాయి. ఓ సినిమా ప్రీప్రొడక్షన్‌లో ఉంది. అదికాకుండా షార్ట్ ఫిలిం చేశాను. ఎలక్షన్‌ తర్వాత దాన్ని రిలీజ్‌ చేస్తాను.

బిజెపికి సపోర్ట్‌ చేస్తున్నారు?
అవును నా దగ్గరకు చాలామంది వచ్చారు. కానీ ఎక్కువగా వచ్చి నన్ను ఎట్రాక్ట్‌ చేసింది బిజెపినే. మోడీ పనులు కూడా నచ్చాయి. నేను ప్రస్తుతం సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను. రాజకీయాలు కూడా తోడయితే ఆ పనులు ఎక్కువగా చేయవచ్చు.

ఏ తరహా సామాజిక సేవలు చేస్తున్నారు?
'పేసినేట్‌ ఫౌండేషన్‌' బ్రాండ్‌ అంబాసిడర్‌గా 2010 నుంచి ఉన్నాను. మొట్టమొదటగా కూకట్‌పల్లిలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ను ఎంచుకుని ఎడ్యుకేషన్‌ మీద అవగాహన కల్పించడం. నా తండ్రిగారు, భర్త కూడా ఇలాంటివి చేస్తున్నారు. ఆ ప్రభావం నామీద పడింది. ప్రభుత్వ స్కూల్స్‌ అంటే ఆదర్శంగా ఉండాలనేది ఇందులోని పాయింట్‌. విద్యార్థినుల కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు చాలా స్కూల్స్‌లో లేవు. విద్య అంటే ఒక్కటే కాదు.. టైలరింగ్‌, కార్పెంటింగ్‌ ఏదైనా అన్ని స్కిల్స్‌ నేర్చుకోవాలి.

ఈ పాత్రకు అవార్డు వస్తుందనుకుంటున్నారా?
ప్రతిసారీ అవార్డు రావాలనుకుంటాను. నా ఇంటి నిండా నందులుండాలనుకుంటాను.

నటిగా ప్రమోషన్‌ విషయం బాధ్యత ఉంటుంది?
నటికి తప్పకుండా ఉండాలి. చాలామంది సినిమా తీశాక ప్రమోషన్‌కు రానంటున్నారు. వచ్చి చెబితేగానీ ఆ చిత్రం గురించి... ఇంత ఉందా అని జనాలకు తెలుస్తుంది. రాకుండా కేర్‌లెస్‌గా ఉండేవారు నా దృష్టిలో మూర్ఖులే. సినిమా కంటే వారేం గొప్పకాదు అని ముగించారు మంచు లక్ష్మి.

వెబ్దునియా పై చదవండి