పాత సినిమాల కలయిక "యమదొంగ"

శుక్రవారం, 17 ఆగస్టు 2007 (14:52 IST)
WD PhotoWD
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్, ప్రియామణి, మోహన్‌బాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, శివపార్వతి తదితరులు..
కెమెరా: సెంథిల్‌కుమార్
సంగీతం: కీరవాణి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: చెర్రి
దర్శకుడు: రాజమౌళి

క్లుప్తంగా చెప్పాలంటే... చాలా సినిమాల కలయిక. కాపీ చేసినా క్లాస్‌గా చేశారు దర్శకుడు. రాజమౌళి, యమలోకం వెళ్ళడం "యమగోల", చిరంజీవి "యముడుకు మొగుడు" చిత్రం, కొన్ని సీన్స్ దానవీరసూరకర్ణ, ఇలా రకరకాలుగా సినిమాలు గుర్తుకురాకమానవు.

కథ: రాజా (జూనియర్ ఎన్టీఆర్) చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికేస్తుంటాడు. ఆ ఊరిలోనే ఓ జమిందారీ కూతురు మహేశ్వరి (ప్రియామణి)ని ఓ రోజు ప్రమాదంలో రాజా కాపాడతాడు. దానికి గుర్తుగా నరిసింహస్వామి గొలుసు బహుమతిగా ఇస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాపాడతాడు. మరోవైపు... ఎంఎస్. నారాయణ ఓ ధనికుడు. తన భార్యరు ఓ ఖరీదైన గౌన్ కొంటాడు. కానీ అది దొంగలించబడుతుంది. దాన్ని తెచ్చేపనిని ఈ దొంగ (రాజా)కు అప్పగిస్తాడు. దీన్ని తెస్తే పదిలక్షలు ఇస్తాననే డీల్ కుదుర్చుకుంటాడు.

వెతికే ప్రయత్నంలో మహేశ్వరి గౌన్ వేసుకున్న దృశ్యం కనబడుతుంది. ఆవిడను పట్టుకునే ప్రయత్నంలో ఉంటే ఈమెను మరికొంతమంది వెంటాడుతుంటారు. చివరికి ఆమెను కాపాడి గౌన్‌ తీసుకుంటాడు. ఆ తర్వాత మహేశ్వరి ఫ్లాష్‌బాక్ తెలుసుకుని ఆస్తికోసం ఆమె మామలు చేస్తున్న అకృత్యాలను అడ్డువేయాలనుకుంటాడు. ఈలోగా గౌన్ తీసుకుని ఎం.ఎస్, నారాయణ వద్దకు వస్తాడు రాజా. తన భార్య గౌన్ దొరికిందన్న ఆదనంతో ఎం.ఎస్. గుండెఆగి చనిపోతాడు. డబ్బులు చేతిలోకొచ్చినట్లు వచ్చి జారిపోయాయన్న బాధతో రాజా తప్పతాగి ఎం.ఎస్. ప్రాణాలు హరించినందుకు యమధర్మరాజుని దుర్భాషలాడతాడు. చులకన చేసి మాట్లాడతాడు.

యమలోకం నుంచి, యమధర్మరాజు (మోహన్‌ బాబు), అష్ట దిక్పాలకులు ఈ సన్నివేశాన్ని తిలకిస్తారు. నిండుసభలో తనకు జరిగిన అవమానం, హేళన తట్టుకోలేక నిండు నూరేళ్ళు ఆయువున్న రాజాను యమగండం పేరుతో యమధర్మరాజు కుట్రపన్ని నరకానికి వచ్చేలా చేస్తాడు. పెళ్ళి రోజున యమధర్మరాజు తన భార్య (ఖుష్బూ)తో కలిసి విహార యాత్రకెళతాడు. తన "యమపాశం"ను చిత్రగుప్తుడి (బ్రహ్మానందం) కిచ్చి జాగ్రత్తగా భద్రపరచమంటాడు. చిత్రగుప్తుణ్ణి మాయచేసి ఆ యమపాశాన్ని రాజా సొంతం చేసుకుని తానే యమధర్మ రాజుగా ప్రకటించుకుంటాడు.

ఎవరు యమధర్మరాజుగా ఉండాలో తేలడానికి నారదుడు (నరేష్) ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. అందులో రాజానే గెలుస్తాడు. తదుపరి సందర్భంలో "యమపాశం" మాజీ యమధర్మరాజు చేతికి చిక్కుతుంది. మహిమగల యమపాశం చేతికొచ్చేసరికి ఈ పాపి ( రాజా) పాపాలు లెక్కకట్టమని చంద్రగుప్తుణ్ణి ఆదేశిస్తాడు. చిట్టాలో అతగాడి పాపాల లెక్కలు కనబడవు. యమపాశం తన చేతిలో ఉన్నప్పుడు రాజా వాటిని మాయం చేస్తాడు.

రాజా ఇక్కడుంచే మనకు శిరోభారం ఎక్కువయ్యేట్లు ఉంది. మరో "యమగండం"ను ఆసరగా తీసుకుని అతన్ని మళ్ళీ ఇక్కడికి రప్పించొచ్చు... అనుకుని మానవలోకానికి పంపించేస్తాడు. భూలోకంలో అష్టకష్టాలు పడుతున్న మహి బాధలు తొలగించి రాజా ఆమె మామయ్య భరతం పడుతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇంతలో రాజాకు తరచూ అప్పులిచ్చే ధనలక్ష్మి (మమతా మోహన్‌దాస్) గెటప్‌లో యమధర్మరాజు వచ్చి ఈ ప్రేమికుల్ని విడగొడతాడు. మళ్ళీ ప్రేమికులు కలుసుకున్నారా? చివరికి యమధర్మరాజు తాను చేసింది సబబేనని భావించాడా? అనేది తెరమీద చూడాల్సిందే...

రాజమౌళి కమర్షియల్ హంగులు (ద్వంద్వార్థాలు, ఎక్స్‌పోజింగ్) మేళవించినా... ఈసారి సృజనాత్మకతను ఎక్కువ గుప్పించారు. ఎన్టీఆర్‌తో యంగ్ యమధర్మరాజు గెటప్ వేయించడం... ఈ సందర్భాన్ని జొప్పించి. అది అతికినట్లుగా కాకుండా సదరు ప్రేక్షకుడు కన్విన్స్‌ అయ్యేలా గ్రాఫిక్స్ సహాయంతో కీర్తిశేషులు ఎన్టీఆర్‌ను తెరపైన మెరిపించడం... వీటన్నింటినీ మించి ఎన్టీఆర్‌లో కొత్త లుక్ తీసుకురావడం చిత్రానికి ప్లస్. కాకపోతే సినిమా నిడివి ఎక్కువై సాగదీసినట్లు అనిపించింది.

పనితీరు: నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ... ఇలా ప్రతిదానిలోనూ, అసలు సినిమా మొత్తానికే జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. లావుగా ఉన్నప్పుడు డాన్స్ ఎంత బాగా చేసినా అదంత అందంగా అనిపించేది కాదు. సన్నబడ్డాక కదలికల్లో వేగం పెరిగింది. అందుకే స్టెప్‌లు ఈజీగా వేశాడు. పెట్టుకున్న కిరీటం కాస్త పెద్దదైంది. "యువ యమధర్మరాజు" గా తన తాతను గుర్తుచేశాడు. ఇప్పటి వరకూ వేసిన పాత్రలే వేసి, చూపిన నచనే చూపిన ఎన్టీఆర్ ప్రేక్షకులకు ఈసారి రిలీఫ్ ఇచ్చాడు. మన కథానాయకులు పాటలు పాడితే వారి గాత్రాన్ని ఇట్టే కనిపెట్టేయొచ్చు.
WD PhotoWD


ఓ లమ్మీ తిక్కరేగిందా.... అంటూ ఎన్టీఆర్ పాడిన రీమీక్స్ పాట బాగుంది. యమధర్మరాజు వేషానికి మోహన్ బాబు సరితూగాడు. ఒకప్పుడు సత్యనారాయణ తర్వాత మళ్ళీ ఈయనే అనిపించాడు. అహంకారం, క్రూరత్వం, కరుకుదనం, చిలిపిదనం, హాస్యరసం, భావగర్బిత మేళవింపుగా సాగే పాత్ర ఇది. ఇన్ని రసాలనూ మోహన్‌బాబు తనదైన శైలిలో అవలీలగా పండించారు. కథానాయికగా తెలుగులో తొలి చిత్రం మమతా మోహన్‌దాస్‌కు. "ఏందబ్బాయా...! అంటూ నెల్లూరు యాసలో తనపాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. వాయిస్‌పరంగా, నటనపరంగా ధనలక్ష్మి పాత్రలో చక్కటి పెర్‌ఫార్మెన్స్ ప్రదర్శించింది.

కళాదర్శకుడు ఆనంద్‌సాయి వేసిన భారీ యమలోకం సెట్ భారీగానే ఆకట్టుకుంది. నాటి ఎన్టీఆర్ కనిపించే దృశ్యాలను గ్రాఫిక్స్ సహాయంతో సహజసిద్ధంగా తీసుకురాగలిగారు. పాటలన్నీ బీట్‌ పరంగా, దృశ్యపరంగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథనంలో ఎత్తుపల్లాలు గోచరిస్తాయి. సక్సెస్‌పుల్ దర్శకునిగా ముద్రపడిన రాజమౌళి చేతుల్లో రూపుదిద్దుకున్న "యమదొంగ" సక్సెస్ దొంగ అవుతాడో లేదో వేచి చూడాలి. మొత్తానికి కాలక్షేప బఠాని. మరోవైపు సెప్టంబర్ 18వరకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్‌లేకపోగా, చిరు శంకర్‌దాదా జిందాబాద్ అటూఇటూగా ఉండడంతో అప్పటివరకు పర్వాలేదు.