'లడ్డుబాబు'ను చూసి కుర్చీల్లో కూర్చుంటారా లేదా...? రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (19:00 IST)
WD
లడ్డుబాబు నటీనటులు: అల్లరి నరేష్, భూమిక, పూర్ణ, కోట, గిరిబాబు, అలీ తదితరులు, మాటలు: నివాస్, సంగీతం- చక్రి, నిర్మాత-త్రిపురనేని రాజేంద్ర, దర్శకత్వం-రవిబాబు

అల్లరి నరేష్ చిత్రాలంటే 100 పర్సెంట్ కామెడీని పండిస్తాయనేది తెలిసిందే. ఇక లడ్డుబాబు అంటూ అల్లరి నరేష్ తో దర్శకుడు రవిబాబు తీసిన చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లడ్డుబాబు ఎంతమేరకు నవ్వించాడు, లడ్డుబాబుతో రవిబాబు చేసిన ఫీట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

లడ్డుబాబు(అల్లరి నరేష్) 28 ఏళ్లకే 268 కేజీలు ఉంటాడు. సన్నగా నాజూగ్గా ఉండే ఇతడిని ఆఫ్రికా దోమకాటుతో లడ్డుబాబుగా మారిపోతాడు. ఐతే భారీకాయుడిగా మారిపోయినా తను ఇష్టపడే అమ్మాయిని పెళ్లాడాలని తహతహలాడుతుంటాడు. లడ్డుబాబుకు ఎంతకీ పెళ్లి కాకపోవడంతో ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి గోవాకు షిఫ్టయిపోవాలనుకుంటాడు లడ్డుబాబు తండ్రి ముష్టి కృష్ణయ్య(కోట శ్రీనివాసరావు). ఒకానొక సందర్భంలో మాయ(పూర్ణ)తో లవ్‌లో పడిపోతాడు లడ్డు.

లడ్డు ప్రేమాయణం ఇంకా ముదిరి పాకానపడకముందే మూర్తి(అతులిత్) తనతో స్నేహం చేయాలని పట్టుబడతాడు. మూర్తి మాటలకు లడ్డు పడిపోతాడు. దాంతో అతడిని వెంటబెట్టుకుని వెళతాడు మూర్తి. అలా మూర్తితోపాటు అతడి తల్లి(భూమిక)కి బాగా దగ్గరవుతాడు. ఐతే ఓ సంఘటన కారణంగా మూర్తి కుటుంబానికి దూరంగా జరుగుతాడు లడ్డు. ఎందువల్ల దూరమయ్యాడు... పూర్ణతో ప్రేమ ఏమయ్యిందనేది మిగిలిన కథ.

పెర్ఫార్మెన్స్....

అల్లరి నరేష్ అంటే తన మేనరిజంతో కడుపుబ్బ నవ్విస్తాడు. కానీ లడ్డుబాబుగా మారిపోవడంతో అతడి మేనరిజం బయటకి కనిపించలేదు. భారీకాయుడిగా హెవీ మేకప్ తో ఉన్న అల్లరి నరేష్ యాక్టింగ్ చేసేందుకు కష్టపడ్డాడు కానీ, అతడి మేనరిజం పూర్తిస్థాయిలో బయటకి రాకపోవడంతో అల్లరి నరేష్ మార్కుకు కొంత కోతపడ్డట్టయ్యింది. ఇక భూమికా చావ్లా పాత్ర చాలా బావుంది. కోట శ్రీనివాసరావు పాత్ర అహ నా పెళ్లంట పాత్రను గుర్తుకు తెస్తుంది. పూర్ణ ఏదో కావాలని పెట్టినట్లు ఉంది కానీ, పెద్దగా ఏమీలేదు. ఇక మిగిలిన పాత్రలు కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవిగానే ఉంటాయి.

విశ్లేషణ....
లడ్డుబాబు బిగినింగ్ లో ఏదో ఉన్నట్లు అనిపించినా మెల్లమెల్లగా స్పీడు తగ్గి బ్యాలెన్స్ పోయినట్లయింది. ఇంటర్వెల్ కు ముందు చాలా ఫన్నీగా కథ నడిచింది. కానీ సెకండాఫ్ లో ఎక్కువగా కథను భూమికపై లాగించేడు రవిబాబు. లడ్డుబాబు లావుగా ఉన్నాడని నవ్వించేందుకు రవిబాబు చెప్పించిన జోకులు నవ్వు తెప్పించలేకపోయాయి. ఏదో ఒకటిరెండు సన్నివేశాల్లో బాగా నవ్వులు పూయించాడు కానీ అనుకున్నంతగా హ్యూమర్ పండలేదు.

ఇంకా లడ్డుబాబుకు ఓ ఆపరేషన్ చేస్తే సన్నగా మారిపోవడం, ఆ తర్వాత ఓ బాటిల్ నెయ్యి తాగగానే లడ్డుబాబులా మారిపోవడం చిత్రం, వెటకారంగా అనిపిస్తుంది. మొత్తంగా అల్లరి నరేష్ లడ్డుబాబుగా కుర్చీల్లో కూర్చోనివ్వడని అనుకునేవారికి కాస్త నిరాశ ఎదురవుతుంది.

వెబ్దునియా పై చదవండి