సాధారణంగా ఎండాకాలం రాగానే కేవలం పగలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. దీనివల్ల అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు, బెట్ట జలుబు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటివి ఎక్కువగా దాడి చేస్తాయి. ఇక గుండెపోటు వంటి సమస్యలు కూడా ఎండాకాలంలో ఎక్కువ ప్రభావం చూపుతాయి. మరి వేసవిలో విజృంభించే వ్యాధులు, తలెత్తే ఆరోగ్య సమస్యలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..
వేసవి కాలంలో వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే... వీలైనంత వరకు ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. ఖద్దర్ వస్త్రాలు లేదా తేలికైన దుస్తులను ధరించాలి. ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీని తలకు విధిగా ధరించాలి. అలాగే, ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా వీలైనంత మేరకు నీరు తీసుకోవడం ఉత్తమం.
వేవసికాలంలో వీలైనంత మేరకు ఆల్కాహాల్, కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇందుకంటే ఇవి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తినకుండా ఎక్కువసార్లు కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా, ఉత్తేజభరితంగా ఉంటుంది. పైగా, శరీర ఉష్ణోగ్రతను సమర్థంగా నియంత్రించగలుగుతుంది.