ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ను భారత్ చీల్చిచెండాడింది. పాకిస్థాన్ ఒక టెర్రరిస్థాన్ అని, అది ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిందని దుమ్మెత్తిపోసింది. పాకిస్థాన్ అంటే స్వచ్ఛమైన నేల అని, కానీ, ఇప్పుడు అది స్వచ్ఛమైన ఉగ్రభూమిగా మారిందని ఆగ్రహించింది.
ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం రైట్ ఆఫ్ రిప్లై కింద పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. తమదేశానికి భయపడి భారత్ కాశ్మీర్ ప్రజల్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నదన్న పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఓ పరిశ్రమగా వర్ధిల్లుతున్నదని, దానికి రాజకీయ అండదండలున్నాయని ఐక్యరాజ్యసమితిలోని భారత తొలి కార్యదర్శి ఈనమ్ గంభీర్ పునరుద్ఘాటించారు.
పాకిస్థాన్ అంటే స్వచ్ఛమైన నేల అని అర్థం. అది ఇప్పుడు స్వచ్ఛమైన ఉగ్రవాద భూభాగంగా మారిందంటూ విమర్శించింది. ఆ దేశం టెర్రరిస్టుల్ని తయారు చేసి, ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నది. అందుకే అది పాకిస్థాన్ కాదు, టెర్రరిస్థాన్ అని ఈనమ్ వ్యాఖ్యానించారు. అలాగే, కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న వాస్తవాన్ని పాకిస్థాన్ గుర్తెరిగి మసలుకోవాలని ఈనమ్ గంభీర్ సూచించారు.