జడ్జీలే రోబోలైతే.. ఎలా వుంటుంది..? తీర్పులు కరెక్ట్‌గా ఇస్తాయా?

మంగళవారం, 25 అక్టోబరు 2016 (13:03 IST)
జడ్జీలే రోబోలైతే.. ఎలా వుంటుంది..? ఇదేంటి రోబోలు తీర్పునిస్తే ఇంకేమైనా ఉందా? అని జడుసుకుంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. కోర్టుల్లో ఇక న్యాయమూర్తులకు బదులు రోబోలు కనిపిస్తాయని.. ఇవి ఇచ్చే తీర్పులు కూడా 79 శాతం కరెక్టుగానే ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. కంప్యూటర్ అనుసంధానిత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టంతో కూడిన ఈ రోబోలు ఇచ్చే తీర్పులు కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడవచ్చునని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ రీసెర్చర్లు చెప్తున్నారు. 
 
కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్ ఉండిపోవడాన్ని నిరోధించేందుకు రోబో జడ్దిల నియామకం ఎంతగానో ఉపకరిస్తుందని లండన్ పరిశోధకులు అంటున్నారు. టార్చర్ వంటి 584 కేసుల విషయంలో యూరప్‌లోని సీనియర్ న్యాయమూర్తులు పాటించిన పద్ధతిని, సమాచారాన్ని కంప్యూటర్లు అధ్యయనం చేసి ఈ రోబోలకు అప్పగిస్తాయని, దాంతో ఇవి తీర్పులు ఇవ్వగలుగుతాయని పరిశోధకులు చెప్పారు. 
 
అయితే ఇందుకు ఇంకా చాలాకాలం పట్టవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. అతి ముఖ్యమైన కేసుల పరిష్కారంలో జడ్జీలు ఇలాంటి రోబోలను వినియోగించుకోవచ్చునని.. దీనిపై కచ్చితమైన పరిశోధనలు జరుపుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి