తెలుగు సినిమా రెండుగా విడిపోయింది. తెలంగాణ, ఆంధ్ర. కానీ ఎవ్వరైనా సినిమా తీయాలంటే బేసిక్ నేర్చుకోవాలి. సినిమా ఎలా తీయాలి. కథలు ఎలా వుండాలి. సంస్కృతిని ఎలా చూపించాలి? లైటింగ్‌లో మిడ్‌షాట్, లాంగ్‌షాట్, క్లోజ్ అనేవి ఇలా రకరకాలుగా సినిమాలో ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటే ఎక్కడ సినీమా రంగం ఉన్నా డెవలప్ అవుతుంది.. తెలుగులో అదే లోపిస్తుందని నాగార్జున అంటున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన సంగతులు...
* ఫ్యాన్స్‌కు మీరిచ్చే సూచనలు ఏమిటి?
వారికి నేను చెప్పేది ఒక్కటే. దయచేసి మీరు నాకోసం హైదరాబాద్ రావద్దు. నేను ఆరోజు ఉండటం లేదు. పైగా పుట్టిన రోజు కూడా జరుపుకోవడంలేదు.
* 'మనం' వంద రోజులు ఎలా చేస్తున్నారు?
చాలా గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నాం. నాన్నగారి అవార్డును కూడా పెద్ద ఫంక్షన్‌లా చేసి రెండింటిని గ్రాండ్‌గా జరపాలనుకుంటున్నాం. త్వరలో వివరాలు తెలియజేస్తాను.
* సీనియర్‌గా తెలంగాణ ఇండస్ట్రీ గురించి మీరేం చెప్పదలిచారు?
సినిమా అనేది యూనివర్సల్. ఏరంగంలోనైనా మనం సరిగ్గా పనిచేయాలంటే బేసిక్ నేర్చుకోవాలి. బాలీవుడ్‌లో సాంకేతిక రంగంలో చాలా అప్‌డేట్‌గా ఉంటారు. చేతిలో ఉన్న నెట్ ద్వారా హాలీవుడ్‌లో ఎలా చేస్తున్నారనేవి వివిధ శాఖల వారు తెలుసుకుని తమ పని విధానానికి అన్వయించుకుంటారు. అది తెలుగులో లోపించింది. ఇప్పటికీ తెలుగు సినిమా చెన్నైపైనే ఆధారపడుతుంది. అందుకే రేపు తెలంగాణ సినిమా ఎదగాలన్నా బేసిక్ నేర్చుకోవాలి. అప్పుడే మనకు తెలిసిన మన సంస్కృతి సాంప్రదాయలను మరింత ఆకర్షణీయంగా ప్రేక్షకులకు చూపించగలుగుతాం.
* 'మీలో.. కోటీశ్వరుడు.. ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది?
జీవితంలో మర్చిపోలేని మైలేజ్ ఇచ్చింది. సామాన్యు పౌరుడితో మమేకం అవ్వడం ఎవరితోనూ చెప్పుకోలేని చేదు అనుభవాలను, సంఘటనలను వ్యక్తిగత విషయాలను వారు వివరించడం నన్ను చలించివేసింది. అక్కడ ప్రతి గుండె ఓ జ్ఞాపకంతో నిండిపోయింది. ఈ షో 43 ఎపిసోడ్లు వస్తుందని ముందుగానే అనుకున్నాం. బాలీవుడ్‌లో అమితాబ్ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అయింది. దాని ఆధారంగా దక్షిణాదిన చేసినా సక్సెస్ కాలేదు. తొలిసారిగా తెలుగులో చేసిన ఈ ప్రోగ్రామ్‌ను రెండు కోట్ల మంది వీక్షించారు. అటు పరిశ్రమలోనూ ఇటు సన్నిహితులు, స్నేమితులు కూడా బాగా ప్రోత్సహించారు. తాతినేని రామారావు, సత్యానంద్ వంటివారెందరో ఫోన్లు చేసి తమ మనవళ్లతోనూ కూర్చుని చూస్తూ ప్రశ్నలను చర్చించుకుంటూ వుంటామని చెబుతున్నారు. రీసెంట్‌గా చిన్న పిల్లలు కూడా 'అంకుల్' అంటూ పలుకరిస్తున్నారు. ఈ షో వల్ల కొత్తగా ఫ్యాన్స్ నా ఖాతాలో చేరారు.
* అఖిల్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు?
ఇంకా ఏమీ అనుకోలేదు. ఇంకా 20 ఏల్ళే. ఇప్పుడిప్పుడే కథలు వింటున్నాడు.
* మీ ఫ్యామిలీలో ఇతర నటుల్ని సూచనలు ఇస్తారా?
ముందుగా వారే కథలు విని, వారికి నచ్చితే నా దగ్గరకు వస్తారు. నాన్నగారు కూడా అదే మాకు చెప్పేవారు. వయస్సు తేడాలబట్టి కథలు వుంటాయి.
* ఎఎన్‌ఆర్ అవార్డులు కొనసాగిస్తారా?
తప్పకుండా. నాన్నగారి కోరిక అది. జనవరిలో ఏఎన్నార్ అవార్డు కార్యక్రమం జరగాల్సివుంది. ఆలస్యమైంది. అది సెప్టెంబర్‌లో పెద్దగా ఫంక్షన్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం.
* మనం రీమేక్ రైట్స్ ఎవరికి ఇచ్చారు?
చాలా మంది వచ్చారు. 'మనం' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. అయితే ఆ కథ మా ఫ్యామిలీకి సరిపోయింది. అందులో ఉండే సన్నివేశాలన్నీ మా కుటుంబానికి దగ్గరగా వున్నవే. అలాంటి కథను చేయాలంటే మరో ఫ్యామిలీనే చేయాలి. లేదంటే కథ సహజత్వం కోల్పోతుంది.
* చిరంజీవితో మల్టీస్టారర్ చేస్తారని చెప్పారు కదా ఎప్పుడు?
అబ్బే అదేంలేదు. ఆయన షోలో వచ్చారు. ప్రశ్న వేశారు. సమాధానం చెప్పాను. అది అంత సీరియస్‌గా తీసుకోకండి. చిరంజీవిగారు 150వ సినిమా ఆయన సోలోగానే చేయాలి. ఒకవేళ కథలు కుదిరితే తప్పకుండా ఆయనతో కలిసి చేస్తాను. పెద్ద మల్టీస్టారర్ చిత్రమవుతుంది.
* ఎన్‌టిఆర్‌తో సినిమా ఎప్పుడు?
త్వరలోనే.. బహుశా సెప్టెంబర్‌లో అవుతుంది. తారక్, నా పాత్ర చాలా వపర్‌ఫుల్‌గా ఉంటాయి. పెద్ద చిన్నా తేడా అనేవి లేవు. మిస్సమ్మ ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్‌ల పాత్రలు ఎలాంటి ప్రాధాన్యత వుంటుందో మా పాత్రలు అలానే వుంటాయి. మనంలో కొత్తగా చూశారు. ఇందులోనూ మరింత కొత్తగా చూస్తారు.
* అన్నపూర్ణ బేనర్‌లో..?
ఉంది. అదికూడా త్వరలో సెట్‌పైకి వెళుతుంది. ఉయ్యాల జంపాల నిర్మాత రామ్మోహన్ కథ ఇచ్చారు. దీనిలో రెండు పాత్రలు చేస్తున్నా. రెండూ గ్రామీణ నేపథ్యంలోనే వుంటాయి. ఒక పాత్రకు రమ్యకృష్ణ, మరో పాత్రకు ఇంకా ఎంపిక చేయాల్సి ఉందంటూ ఇంటర్వ్యూను ముగించారు.