'జయం' నుంచి కథానాయకుడిగా పరిచయమైన నితిన్.. ఆ తర్వాత పది చిత్రాలు ఫెయిల్యూర్ చూశారు. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే..తో హిట్ హీరోగా మారిన ఆయన ఆ తర్వాత కథల ఎంపికలో ఆలోచనల్ని మార్చుకున్నాడు. ఆ మార్పే నిర్మాతగా అఖిల్ సినిమాకు కారణమైంది. అయితే అంతకుముందే ఆయన నటించిన సినిమా 'కొరియర్ బాయ్ కళ్యాణ్'. ఈ చిత్రానికి దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా తమిళంలో నిర్మించారు. తెలుగులో కూడా ఆయనే నిర్మాత. ఈ చిత్రం ద్వారా గౌతమ్ శిష్యుడు ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్‌తో చిట్‌చాట్.
'కొరియర్ బాయ్ కళ్యాణ్' అంటే ఏమిటి?
ఇది ఒక సామాన్య కొరియర్‌బాయ్‌కు ఎదురైన అనుభవమే కథ. కంటెంట్ బాగుంది. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. 'కొరియర్ బాయ్ కళ్యాణ్' (సిబికె). అంటే.. కంటెంట్ బేస్డ్ కథ అని రాశాడు. అతను రాసినట్లే సినిమా కూడా వుంటుంది.
ఎంత కంటెంట్ వున్నా కామెడీ లేకపోతే కష్టమేగా?
కామెడీ లేకపోయినా బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు ఆదరణ పొందాయి. దానిలో ప్రేక్షకుడు కనెక్ట్ అయింది కంటెంట్‌కే.
ఈ సినిమా ఆలస్యమైనా కంటెంట్ ఆదరణ పొందుతుందా?
ఆలస్యమైన మాట వాస్తమే. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఇందులో వున్న పాయింట్ షాకింగ్ పాయింట్. అది ఇప్పుడే బయటపెట్టదలచుకోలేదు. ఈ పాయింట్ వినే నేను నటించడానికి అంగీకరించాను.
అసలు గౌతమ్‌మీనన్ చిత్రంలో చేయాలని ఎందుకనిపించింది?
నేను చాలా కథలు వింటున్నాను. కోన వెంకట్ ద్వారా గౌతమ్‌మీనన్ కథ వినే అవకాశం కల్గింది. అది కూడా చెప్పడానికి దర్శకుడు ప్రేమ్‌సాయి వచ్చారు. అయితే వినేసి ఊరుకుంటే పోతుంది. సినిమా చేయకుండా తప్పించుకుందామని మనస్సులో అనుకుని విన్నాను. కానీ విన్నాక చేయాలనిపించింది.
అంతగా ఇన్‌స్పైర్ అయిన అంశమేమిటి?
ఇది చూస్తేగాని అర్థంకాదు. ఎందుకంటే ఇందులో నేను ఓ ప్రయోగం చేశాను. హీరోగా కాకుండా కథకు ప్రిఫర్ ఇచ్చే సినిమా ఇది. థ్రిల్లర్ అంశం వుంది. ఒకరకంగా చెప్పాలంటే కొత్త ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో అనే టెన్షన్ కూడా ఓ పక్క వుంది. రిస్క్ చేస్తున్నానా! అని కూడా అనిపించింది. ఏదిఏమైనా ఏదో ఒకటి చేయాలి కనుక డేర్ చేసి ఈ సినిమా చేశాను. ఇది హిట్ అయింది. ఇలాంటి జోనర్‌లో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశముంది.
అఖిల్ సినిమా ఎంతవరకు వచ్చింది?
త్వరలో ఆ చిత్రం గురించి వివరాలు తెలియజేస్తాను. టైటిల్ మాత్రం అఖిల్. హీరోకు తగినట్లే కథ కూడా వుంటుంది.
మీపై వస్తున్న విమర్శలకు ఏవిధంగా స్పందించారు?
ఒకప్పుడు విమర్శలంటే భయపడేవాడిని. ఇప్పుడు అలవాటయిపోయాయి. మనం కరెక్ట్‌గా వుంటే .. మన గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను.
యామీ గౌతమి ఎలా నటించింది?
ఆమె నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటుంది. సహజంగా హీరోయిన్‌కు పెద్ద ప్రాధాన్యత వుండదు. కానీ ఈ సినిమాలో ఆమె కూడా కీలకమే.
ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడానికి కారణం?
కార్తీక్ మూడు పాటలు ఇచ్చాడు. తను చాలా బిజీ అయిపోయాడు. గౌతమ్ మీనన్ సందీప్ చౌతాకు అభిమాని. ఆయనకు ఓ పాట ఇచ్చారు. తర్వాత అనూప్‌కు అవకాశం ఇచ్చారు. ముగ్గురు సంగీత దర్శకులు చేసినా ఎక్కడా గత చిత్రాల ఛాయలు మాత్రం కన్పించవు. పాటలన్నీ కొత్తగా వుంటాయి.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తారా?
దానిపై చర్చలు జరుగుతున్నాయి. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం చేస్తున్నా. అన్నీ అనుకూలిస్తే తర్వాత ఆయన దర్శకత్వంలోనే వుంటుంది అని చెప్పారు.