సైబర్ నేరగాళ్లు తమ మేథస్సుకు నిరంతరం పదును పెడుతూనే ఉంటారు. ఆ విధంగా వారు విజయం సాధిస్తుంటారు. తాజాగా వెబ్ బ్రౌజర్‌లో సరికొత్త ఆప్షన్‌ను జోడించి మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచుకుంటున్నారు. కొన్ని వెబ్‌సైట్లలో రహస్య టెక్ట్స్ బాక్సుల ద్వారా ఆటోఫిల్ వివరాలను హ్యాకర్లు చోరీ చేస్తున్నట్లు సెక్యూరిటీ నిపుణుల గుర్తించారు. ఆ వివరాలను పరిశీలిస్తే...
నెటిజన్లు వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్లలో ఆటోఫిల్ ఆప్షన్ ఆన్‌లో ఉంటే ఏదైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయినప్పుడు.. లావాదేవీలు నిర్వహించినప్పుడు మన వివరాలన్నీ బ్రౌజర్‌లోనూ స్టోర్ అవుతాయి. మళ్లీ ఎప్పుడైనా మన వివరాలు అవసరమున్నప్పుడు పేరు లేదా ఈ-మెయిల్ ఐడీని టైప్ చేయగానే గతంలో ఇచ్చిన మిగతా వివరాలన్నీ యధావిధిగా బ్రౌజర్‌లో డిస్ప్లే అవుతాయి.
చాలామందికి అది ఉపయోగకరంగానే అనిపిస్తుంది. ప్రతిసారీ టైప్ చేయాలన్న బాధ తప్పుతుంది అనుకుంటారు. కానీ.. ఆ సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సైబర్ నేరగాళ్లు లాగేసే వీలుందని ఫిన్‌లాండ్‌కు చెందిన ఎథికల్ హ్యాకర్ విజ్లమి కోస్మనెన్ గుర్తించారు. కొన్ని వెబ్‌సైట్లలో రహస్య టెక్ట్స్ బాక్సులను ఉంచి.. వ్యక్తిగత వివరాలతోపాటు.. క్రెడిట్.. డెబిట్ కార్డుల సమాచారాన్నీ సైబర్ నేరగాళ్లు సులువుగా చోరీ చేసేస్తారట. గూగుల్ క్రోమ్.. మొజిల్లా ఫైర్ ఫాక్స్.. యాపిల్ సఫారీ.. ఒపేరా వంటి ప్రముఖ బ్రౌజర్లతోనూ ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఆటోఫిల్ ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.