నీలగిరి చికెన్ కుర్మా ఎలా చేయాలో మీకు తెలుసా?

శనివారం, 5 జనవరి 2013 (17:35 IST)
FILE
నీలగిరి చికెన్ కుర్మా ఇదేదో విభిన్నంగా ఉందే అనుకుంటున్నారా.. అవునండీ శీతాకాలంలో చికెన్‌తో వేడివేడిగా ఫ్రై, 65 అంటూ వండుకుని తింటుంటాం. కానీ వేపుళ్ళు ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత ఈ వీక్ ఎండ్ నీలగిరి చికెన్ కుర్మా ట్రై చేయండి

నీలగిరి చికెన్ కుర్మాకు కావల్సినవి :
చికెన్ ముక్కలు - కేజీ
ఉల్లిపాయలు -2 (సన్నగా తరగాలి)
అల్లం - వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టెబుల్ స్పూన్
టొమాటో- ఒకటి (సన్నగా కట్ చేయాలి)
కారం - టీ స్పూన్
నిమ్మరసం : ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - తగినంత

వేయించడానికి కావల్సినవి :
జీలకర్ర - టీ స్పూన్
సొంపు - టీ స్పూన్
గసగసాలు- టీ స్పూన్
దాల్చినచెక్క - చిన్నముక్క
ఏలకులు - 2
పచ్చి కొబ్బరి తురుము- 5 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 8
శనగలు (కొద్దిగా నూనె వేసి, ఐదు నిమిషాలు వేయించాలి) - టేబుల్ స్పూన్
కరివేపాకు- రెమ్మ
సాంబార్ ఉల్లిపాయలు - 10
పచ్చిమిర్చి - 4
కొత్తి మీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు
పుదీనా ఆకులు - 15

తయారీ విధానం : ముందుగా వేయించిన పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. అడుగుమందం ఉన్న గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కలిపి, మూడు నిమిషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు, ఉప్పు కలపాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. వేయించి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిమిషాలు ఉంచాలి.

తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి ఉడికించాలి. మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పులు నీళ్ళు పోసి, మూత పెట్టి, సిమ్‌లోఉంచాలి. చికెన్ ముక్కలు ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కుర్మాను పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి సైడిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి