ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం "నీలం"

భారత రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకరుగా, ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి... ప్రజల మన్ననలను పొందిన ఆంధ్ర రాజకీయవేత్త నీలం సంజీవరెడ్డి.

ఇప్పటిదాకా రాష్ట్రపతిగా పనిచేసిన వారిలో ఏకగ్రీవంగా ఎన్నికయిన ఏకైక రాష్ట్రపతిగా సంజీవరెడ్డి చరిత్ర సృష్టించారు. పుట్టపర్తి సాయిబాబాను దర్శించని అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఈయన ఒకరు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో ఈయన జీవితం పెనవేసుకు పోయిందని చెప్పవచ్చు. సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టిన రోజుగా చరిత్రలో జూలై 25వ తేదీకి ప్రాముఖ్యం కలదు.
వారసులెలా ఉన్నారంటే...?
  మంచి పాలనా దక్షకుడిగా, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నీలం సంజీవరెడ్డి... తన వారసులను మాత్రం రాజకీయాల్లోకి ప్రోత్సహించలేదు. ఈయన కుమారుడు బెంగళూరులో వైద్యవృత్తిలో స్థిరపడగా, కుమార్తెలు ఎవరూ రాజకీయాలవైపు కన్నెత్తి కూడా చూడలేదు...      


ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18వ తేదీన ఓ రైతు కుటుంబంలో సంజీవరెడ్డి జన్మించారు. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోనూ విద్యనభ్యసించారు. 1935 జూన్ 8వ తేదీన నాగరత్నమ్మను వివాహం చేసుకున్న ఈయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సంజీవరెడ్డి రాజకీయ జీవితంలో... అనేక విజయాలు, కొన్ని అపజయాలలు, మరికొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో ఈయన జీవితం గాఢంగా పెనవేసుకుపోయింది. 1940ల నుంచి 1970ల దాకా రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనలోనూ ఆయన ప్రమేయం ఉందంటే అతిశయోక్తి కానేరదు.

1929లో మహాత్ముడి స్ఫూర్తితో చదువును అటకెక్కించి రాజకీయాల్లో చేరిన సంజీవరెడ్డి... స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకెళ్లారు. తదనంతరం 1946లో మద్రాసు శాసనసభకు, 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు.

1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో సంజీవరెడ్డి మంత్రిగా పనిచేసారు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్.జి. రంగాతో పోటీపడ్డారు. ఆ తరువాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆపై ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో సంజీవరెడ్డి పాత్ర ఎన్నదగ్గది. రాష్ట్ర స్థాపనలో ప్రధాన నిర్ణాయక ఘట్టమైన "పెద్ద మనుషుల ఒప్పందం"లో ఆంధ్ర తరపున అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి అయిన సంజీవరెడ్డి కూడా పాల్గొని ఆ ఒప్పందంపై సంతకం పెట్టారు. ఆంధ్ర అవతరణ తరువాత ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత 1960ల తరువాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపికవడంతో, ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు.

కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసిన సంజీవరెడ్డి, మళ్ళీ 1962లో ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యారు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో, 1964 ఫిబ్రవరి 29న తనపదవికి రాజీనామా చేసాడు. ఆపై ఆయన కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగారు.

1964 జూన్ 9 న లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1967లో నాలుగో లోక్‌సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు స్పీకరుగా కూడా ఎన్నికయ్యారు. స్పీకరు నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నిక కాగానే కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసారు. స్పీకరుగా ఎన్నిక కాగానే తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్‌సభ స్పీకర్‌గా సంజీవరెడ్డి గుర్తింపు పొందారు.

1977లో ఎమర్జెన్సీ తరువాత జూలై 25వ తేదీన సంజీవరెడ్డి జనతాపార్టీ తరపున ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని అలంకరించారు. తదనంతరం 1982వ సంవత్సరంలో రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక, ఆయన రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు. 1996 జూన్ 1వ తేదీన నీలం సంజీవరెడ్డి తుదిశ్వాస విడిచారు.

మంచిపాలనా దక్షకుడిగా పేరుగాంచిన సంజీవరెడ్డి... ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు నిర్వహించి, ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే తన వారసులను మాత్రం రాజకీయాలవైపు ప్రోత్సహించలేదు. ఈయన కుమారుడు వైద్యవృత్తిని స్వీకరించి బెంగళూరులో స్థిరపడగా... కుమార్తెలు ఎవరూ రాజకీయాలవైపు కన్నెత్తి చూడలేదు.

వెబ్దునియా పై చదవండి