ఉడుత - ఊయల - ఐదు పైసలు

PTI
చిన్నప్పుడెప్పుడో చదివిన ఒకటో తరగతి పాఠాలు. ఆ పాఠాల్లో "అమ్మ - ఆవు" ప్రేమాభిమానాల పదాల పొందికలు మొదలుకుని "ఉడుత - ఊయల" ఊహా లోకాలలో విహరింప జేసి "ఱంపము" వంటి కార్యసాధన పదాలతో పూర్తయ్యేవి. ఇలా మా విద్యాభ్యాసం వనవిద్యాలయాల( చెట్ల కింద)లో పూర్తయింది. మేస్టారు చెప్పిన పాఠాలు బుర్రలో ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయనుకోండి.

ఆటవిడుపుగా మా గురువుగారు అప్పుడప్పుడు వనవిహార యాత్రలకు మమ్మల్ని తీసుక వెళ్లేవారు. కాకులు దూరని కారడవి - చీమలు దూరని చిట్టడవిలాంటి అడవులకు వెళ్లకపోయినా అక్కడ మా కంటికి కొన్ని జంతువులు, కీటకాలు, రకరకాల పక్షలు కనిపించి ఉల్లాసాన్ని కలిగించేవి.

ముఖ్యంగా కీచు కీచుమంటూ శబ్దం చేస్తూ అటు నుంచి ఇటు దుమికే ఉడుతల గొడవలు మా ఆనందానికి హద్దులు చెరపేసేవి. వాటి వెంట పరుగెడుతూ కాలాన్ని మరిచిపోయి గడిపేసిన సందర్భాలు ఎన్నో. అటువంటి బాల్యపు తియ్యదనం తిరిగి రుచి చూడాలంటే వస్తుందా...? అందుకే బాల్యంలో పిల్లలకు అందాల్సిన అన్ని సంతోషాలను అందించాలని మా గురువుగారు ఇప్పటికీ మా ఊరు వెళ్లినపుడల్లా చెపుతుంటారు.

ఎంత సంపాదించావ్...? ఏం చేస్తున్నావ్...? లాంటి ప్రశ్నలను మా మేస్టారు అడుగరు. మీ పిల్లలెలా ఉన్నారు.. ఎటైనా యాత్రలకు తీసుకెడుతున్నారా..? పిల్లల చదువే కాదు.. వారి ఆనందం, సంతోషం కూడా ముఖ్యమే. బాల్యంనాటి సంగతులు జీవితంలో రంగుల హరివిల్లులా పరచుకుని ఉంటాయి. ఆ ఆనందమే అప్పుడప్పుడు కొత్త శక్తిని నింపుతుందని చెపుతారు గురువుగారు.

వెబ్దునియా పై చదవండి