హెడ్ మసాజ్‌తో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి!

మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (17:28 IST)
File
FILE
ఈ ఉరుకులు పరుగుల కాలంలో ప్రతి స్త్రీ పురుషుడు, యువతీ యువకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు అయితే విపరీతమైన పనిభారంతో అటు ఇంట్లోనూ, ఇటు ఆఫీసుల్లోనూ సతమతమవుతుంటారు. ఇలాంటి మహిళలకు జుట్టు సమస్యలు కూడా అధికంగా బాధిస్తుంటాయి.

వీరిలో కొంతమందికి వెంట్రుకల కొసలు చిట్లిపోయి, పెళుసుబారినట్లుగా తయారవుతాయి. వీటికితోడు తలలో చుండ్రు సమస్య కూడా తోడవుతుంది. నూనె పెడితే జిడ్డులాగా, పెట్టకుంటే పీచులాగా తయారయ్యే వెంట్రుకల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించటం కూడా చాలా అవసరం.

ఇలాంటివారు మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుండి విశ్రాంతి పొందేందుకు హెడ్ మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది. హెడ్ మసాజ్‌తో పాటు పదిహేను రోజులకు ఒకసారి జుట్టుకు హెన్నా పెట్టుకుని వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే... వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండి కొత్త మెరుపును సంతరించుకుంటాయి.

తలను మసాజ్ చేసుకోవడం అంటే... మంచి కొబ్బరినూనెను తీసుకుని ఒక పద్ధతి ప్రకారం మెల్లగా మర్దనా చేయాలి. కొబ్బరినూనెలో మెంతి గింజలు, మందారపూలు వేసి వేడి చేయాలి. జట్టును పాయలుగా విడదీసి గోరువెచ్చగా ఉన్న కొబ్బరినూనెను వేళ్ళతో తీసుకుంటూ తలకు బాగా పట్టించాలి.

జుట్టు కుదుళ్ళలోకి నూనె ఇంకేలా పెట్టిన తరువాత వెంట్రుకల చివరన కూడా నూనె పెట్టాలి. పదినిమిషాలపాటు అలాగే ఉంచిన తరువాత తల పై భాగం నుండి కిందివరకు, కింది నుంచి పైకి, చెవి వెనుక భాగంలో ఆపోజిట్ డైరెక్షన్‌సో వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి.

ఆ తర్వాత వేడినీటిలో ముంచి, పిండిన టవల్‌ను తలకు గట్టిగా చుట్టాలి. ఇలా చేయడం ద్వారా తలకు ఆవిరి బాగా పట్టి స్వేద రంధ్రాలు తెరచుకుని చక్కగా శుభ్రపడతాయి. అంతేగాకుండా జుట్టు కుదుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి. చిట్లిపోయిన వెంట్రుకల కొసలు కూడా మెల్ల మెల్లగా సర్దుబాటు అవుతాయి. అయితే, ఈ మసాజ్‌ను క్రమం తప్పకుండా పైన చెప్పిన పద్ధతిలో పాటించాలి. అప్పుడే సరైన ఫలితాలను పొందగలుగుతారు.

వెబ్దునియా పై చదవండి