గులాబీ రంగు వంటి పెదవుల కోసం... కొన్ని చిట్కాలు!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:46 IST)
File
FILE
సాధారణంగా యువతులు తమ పెదాలు మరింత అందంగా ఉండాలని, గులాబీ రేకుల్లా మెరిసిపోవాలని ఏవేవో చేస్తుంటారు. వాస్తవానికి కాలంతో నిమిత్తం లేకుండా పొడిబారే పెదవులను అలానే వదిలివేస్తే మాత్రం ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. దీంతో పెదాలు పగిలి రక్తస్రావం కూడా జరుగుతుంది. అందుకే ఈ సమస్యకు ఆరంభంలోనే చెక్ పెట్టాలి.

వాస్తవానికి పెదాలు పొడిబారడానికి ప్రధాన కారణం పెదవుల్లో తేమ తగ్గిపోవడననే విషయాన్ని తెలుసుకోండి. దీన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెపుతున్నారు.

ఇందులోమొదటిగా బ్లాక్‌టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో మరగించి, ఆ తర్వాత ఆ బ్యాగును నేరుగా పెదవులపై కొద్దసేపు ఉంచాలి. అలా రోజుకు నాలుగైదు సార్లు చేయడం వల్ల పెదాలు కొంతమేరకు తేమను సంతరించుకుంటాయి. గోరువెచ్చిన నీటిలో తడిపిన నీటిని అధరాలపై రాసి తీయాలి. మళ్లీ రాయాలి. ఇలా మూడు రోజుల పాటు 10-15 నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితం ఉండటమే కాకుండా. పెదవులూ మెరుస్తాయి.

తరచూ లిప్‌స్టిక్ వేసుకునే వారు దాన్ని తొలగించిన తర్వాత కాస్త వెన్న రాసుకుంటే మంచిది. అలా చేయడం వల్ల అధరాలు పొడిబారే సమస్య ఉండదు. అలాగే, అరకప్పు పాలలో గుప్పెడు గులాబీ రేకులు గంటసేపు నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై పూతలా వేయాలి. అర్థగంట తర్వాత ఈ పూతను తొలగిస్తే నలుపు మచ్చ పోవడమే కాకుండా పెదవులు గులాబీ రేకుల్లా మెరుస్తాయి కూడా.

వీటితో పాటు.. దోసకాయ కూడా అధరాల పోషణకు చక్కగా ఉపయోగపడుతుంది. దోసకాయ ముక్కలను తరచుగా పెదవులపై రుద్దడం వల్ల లేత గులాబీ వర్ణంలోకి మారుతాయి. అలాగే రాత్రి పడుకునే సమయంలో అర చెంచా వెన్నకు కాస్త తేనె కలిపి రాసుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల మరుసటి రోజు పెదవులు మృదువుగా మారడమే కాకుండా, త్వరగా పొడిబారవు కూడా.

వెబ్దునియా పై చదవండి