వచ్చే యేడాది భారత్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. తాజాగా వాషింగ్టన్ నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా ఐక్యంగా ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు.
'వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను విశ్వసిస్తున్నా. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి బీజేపీ పాలకులను ఇంటికి పంపించింది. త్వరలో జరగబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా చూడండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఈ రాష్ట్రాల ఫలితాలు స్పష్టమైన సంకేతాలిస్తాయి.