మేకిన్ ఇండియా... మ‌న త‌యారీ ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చేసింది

బుధవారం, 19 అక్టోబరు 2016 (20:07 IST)
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీనిని తయారు చేశామని సంస్థ తెలిపింది. ఈ సర్క్యూట్‌ సిరీస్‌ బస్సును త్వరలోనే అశోక్  లేల్యాండ్‌ వివిధ విభాగాల్లో కూడా ప్రవేశపెట్టనుంది. 
 
లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడిచే ఈ బస్సును ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకధాటిగా 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనిని ఛార్జింగ్‌కు దాదాపు మూడుగంటలు పడుతుంది. ఈ బస్సులో అత్యధికంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అగ్నిప్రమాదాలను పసిగట్టే వ్యవస్థ, అడ్వాన్స్‌డ్‌ టెలీమెటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్లు.. ఆన్‌బోర్డ్‌ వైఫై ఉన్నాయి. ఈ బస్సులో మొత్తం 31మంది ప్రయాణించ‌వ‌చ్చు.

వెబ్దునియా పై చదవండి