అఖిలేష్‌పై వేటు: మోడీకి- అపర్ణకు లింకేంటి..? మోడీపై ములాయం ప్రశంస అందుకేనా?

శనివారం, 31 డిశెంబరు 2016 (11:45 IST)
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు చివరకు ఎస్పీ చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ములాయం తన కన్నకొడుకు, యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించడంతో ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది.

కొత్త సీఎంను ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తండ్రి ములాయం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను సవాల్ చేస్తూ.. 235మంది రెబల్ అభ్యర్థులతో అఖిలేష్ తన సొంత జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
కానీ ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించ లేదు. దీనికి కారణం.. ఆ స్థానాన్ని ములాయం తన చిన్న కోడలికి ఇదివరకే ఖరారు చేశారు. ములాయం రెండో భార్య సాధనాగుప్తా పార్టీలో అఖిలేష్ చేతుల్లోంచి ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి అపర్ణ యాదవ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. 26ఏళ్ల అపర్ణ యాదవ్ సాధానగుప్త తనయుడైన ప్రతీక్ సతీమణి. రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న అపర్ణ యాదవ్ ఎస్పీ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు.
 
బాబాయ్ శివపాల్ యాదవ్-అబ్బాయ్ అఖిలేష్ యాదవ్ పోరులో ములాయం శివపాల్ యాదవ్‌నే వెనుకేసుకురావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. ములాయం రెండో భార్య సాధనాగుప్తా శివపాల్ యాదవ్‌కే మద్దతు పలకాలని ములాయంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా అఖిలేష్ యాదవ్‌కు ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకంగా మారింది. 
 
ఎస్పీ ప్రజా ప్రతినిధి ఉదయ్ వీర్ సింగ్ దీనిపై స్పందిస్తూ రాసిన ఓ లేఖ రాశారు. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేష్ ను టార్గెట్ చేసిందని లేఖలో పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే, అపర్ణయాదవ్ కే కేటాయించిన లక్నో కంటోన్మెంట్ లో ఎస్పీకి పట్టు లేదు. ఇంతవరకూ ఆ స్థానంలో పార్టీ గెలిచింది లేదు. అలాంటి స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వడం పట్ల అపర్ణ గుర్రుగా ఉన్నారు. అఖిలేష్ భార్య డింపుల్ విషయంలో ఈ పరిస్థితి వేరుగా ఉంది.
 
పార్టీ సునాయసంగా గెలిచే స్థానం నుంచి డింపుల్ ను పోటీకి దించడంతో.. ఆమె పెద్దగా కష్టపడకుండానే పార్లమెంటులో అడుగుపెట్టారు. మరోవైపు అపర్ణ మాత్రం తన గెలుపు కోసం కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులన్ని ములాయం రెండో భార్యకు, ఆమె కుమారుడు ప్రతీక్ కు ఏమాత్రం రుచించలేదు.

దీంతో ములాయంపై ఒత్తిడి తీసుకొచ్చి అఖిలేష్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సాధనగుప్తా తనయుడు, అపర్ణయాదవ్ భర్త ప్రతీక్ రాజకీయాలకు దూరంగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
 
అపర్ణయాదవ్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఏంటంటే.. ఆమె మోడీ అభిమాని. 2015లో ములాయం మనవడి పెళ్లి సందర్బంగా భర్త ప్రతీక్‌తో కలిసి మోడీతో ఓ సెల్ఫీ దిగారు. అప్పట్లో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
అపర్ణ మోడీ అభిమాని కావడం కాకతాళీయమే కావచ్చు గానీ.. ఈమధ్య కాలంలో ములాయం కూడా మోడీపై ప్రశంసలు కురిపించాడిని అపర్ణను రాజకీయాల్లో తేవడానికి లింకుందని రాజకీయ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి