బెంగుళూరులో సామూహిక వేధింపులా? అట్లాంటిదేమీ లేదు... సాక్ష్యమెక్కడ? కొత్త పోలీస్ బాస్

శుక్రవారం, 6 జనవరి 2017 (10:42 IST)
డిసెంబర్ 31వ తేదీ రాత్రి దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో జరిగిన సామూహిక లైంగిక వేధింపులపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు టీవీల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతున్నాయి. కానీ, బెంగుళూరు నగర కొత్త పోలీసు బాస్‌కు మాత్రం అవి కంటికి కనిపించడం లేదు. అస్సలు బెంగుళూరులో సామూహిక అత్యాచారాలే జరగలేదని, అలా జరిగితే సాక్ష్యమెక్కడ అని ప్రశ్నించారు. దీంతో బెంగుళూరు నగర వాసులతో పాటు.. దేశ ప్రజలు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా, డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి రోజున బెంగళూరు ఎంజీ రోడ్డులో కొంతమంది యువతులపై కీచకపర్వం జరిగిన విషయం తెల్సిందే. వీటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు నగర కొత్త పోలీస్ బాస్ ప్రవీణ్ సూద్ కొత్త భాష్యం చెప్పారు. ఆరోపణలు వస్తున్నట్టుగా ఎంజీ రోడ్డులో అట్లాంటిదేమీ జరగలేదని కొట్టిపారేశారు. 
 
దాదాపు కోటి మంది నివసిస్తున్న నగరంలో మహిళలపై వేధింపులు జరిగే అవకాశాలు ఉన్నా, అందుకు సాక్ష్యాలు లేవన్నారు. 'సామూహిక వేధింపులు' అన్న పదం వాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన, ఏదైనా జరిగితే దాన్ని 'అపచారం' అంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు. "డిసెంబర్ 31 రాత్రి పోలీసులు అక్కడ ఉన్నారు. 20కి పైగా మీడియా ఓబీ వ్యాన్‌లు ఉన్నాయి. కానీ ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. ఇవాళ రేపు ఏ చిన్న ఘటన జరిగినా నిమిషాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరులో జరిగినట్టు చెబుతున్న ఘటనలపై ఫిర్యాదులు లేవు" అన్నారు. 

వెబ్దునియా పై చదవండి