94వ ఏటలో కరుణానిధి... ఎమ్మెల్యేగా 60 ఏళ్లు... ప్లీజ్ దగ్గరకి రావద్దు... ఎందుకు?

శుక్రవారం, 2 జూన్ 2017 (16:40 IST)
తమిళ రాజకీయాల్లో కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి జూన్ 3తో 94వ ఏటలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున జన్మదిన వేడుకలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే కరుణానిధి కుమారుడు స్టాలిన్ మాత్రం అదంతా వద్దని వారిస్తున్నారట. దీనికీ కారణం వున్నదని ఆయనే సెలవిచ్చారు.
 
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఎక్కువమంది మధ్యకు వెళ్ళకూడదట. అలా వెళితే ఇన్ఫెక్షన్ సోకుతుందనీ, అందువల్ల జనం మధ్యకు వెళ్ళకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచనలు చేస్తున్నారట. కానీ పెద్దాయన మాత్రం కార్యకర్తల కోలాహలాన్ని చూడాలని గంపెడాశతో వున్నట్లు సమాచారం. వైద్యులు సూచన మేరకు స్టాలిన్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
 
కరుణానిధికి స్వయంగా శుభాకాంక్షలు చెప్పాలన్న ప్రయత్నాన్ని కార్యకర్తలు విరమించుకోవాలని ఆయన వెల్లడించారు. అంతేకాదు... విష్‌తలైవర్.కామ్ అనే వెబ్‌సైట్‌ ద్వారా కరుణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవచ్చని కూడా సూచించారు. 94 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న కరుణానిధి శాసనసభ్యుడిగా 60 ఏళ్ళు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించబోతున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంకే ప్లాన్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి