ఏపీ-ఒడిశా సరిహద్దులో ఏనుగుల గుంపు ఒకటి సందడి చేసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడు రోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్లింది. స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి సరదాగా ఆడుకున్నారు, సెల్ఫీలు దిగారు. బిడ్డ ఇంకా రావట్లేదని అమ్మ ఏనుగు కంగారుగా వెనక్కు వచ్చింది.
అక్కడ పిల్లలు గున్న ఏనుగు చుట్టూ గుమికూడి దాన్ని పట్టించడం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది తల్లి ఏనుగు. దాన్ని అలా చూసేసరికి బిక్కచచ్చిపోయిన యువకులు పరుగులు తీశారు.
అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఓ యువకుడు ఏనుగు రాకను గమనించక అక్కడే ఉండిపోయాడు. తల్లి ఏనుగు అతడిపై దాడి చేసింది. కిందపడేసి తొక్కినంత పని చేసింది. సమయానికి దగ్గరలో ఉన్న యువకులు, స్థానికులు పరుగున వచ్చి ఏనుగును తరిమేశారు.
ఏనుగు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సీన్ మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.