రజనీకాంత్ మనసును బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నాలు చాలా కాలంగా ముమ్మరంగానే సాగుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. తమిళనాడులో గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగి సూపర్ స్టార్ రజనీని బీజేపీ ముగ్గులోకి దింపాలని చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనప్పటికీ ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆశలు చావటం లేదు. ఏరోజుకైనా సరే రజనీ రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే తాను చేరవలసింది కమల దళంలోనే అని బీజేపీ చివరివరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
రజనీకాంత్ తన తాజా చిత్రం కాలా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఇటీవల కొన్నిరోజులున్నారు. ముంబైలో రజనీకాంత్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) సతీమణి అమృత కలసిన ఫొటో శుక్రవారం వెలుగు చూసింది. ‘రజనీకాంత్‌ను కలిశాను, సమాజంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఇద్దరం చర్చించుకున్నాం’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఈ చర్చల సారాంశం తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ట్వీట్ రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. దక్షిణాదిలో బలం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా అత్యంత ప్రజాకర్షణ కలిగిన సూపర్ స్టార్ ను ఆహ్వానించే ప్రతిపాదనను బీజేపీ తరఫున అమృత ఈ సందర్భంగా రజనీకాంత్ ముందు ఉంచారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.