రాహుల్‌కు దేశాన్ని పరిపాలించే సత్తా లేదు: నరేంద్ర మోడీ

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (13:11 IST)
File
FILE
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ లక్ష్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలకు మరింత పదునుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ ప్రచార సభలో ప్రసంగించారు. 'తన కుమారుడికి అండగా నిలిచి, గెలిపించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా కోరుతున్నారు. మేమేమో.. దేశాన్ని రక్షించాలని కోరుతున్నాం. సొంత నియోజకవర్గంలోనే ఒంటరిగా పోరాడలేకపోతే.. రాహుల్ దేశాన్ని ఎలా నడిసిస్తారో!' అంటూ మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రజల కలలను, ఆశలను తాకట్టు పెట్టి, వారి జీవితాలను నాశనం చేశారంటూ సోనియా చేస్తున్న పరోక్ష విమర్శలు ఎవరి గురించో తనకు మొదట్లో అర్థం కాలేదని, అమెరికా పత్రిక కథనం చదివిన తర్వాత ఈ విమర్శలు తన అల్లుడు రాబర్ట్ వధేరా గురించేనని తెలుసుకున్నట్టు చెప్పారు.

'కేవలం పదోతరగతి పాసై, చేతిలో రూ.లక్షతో ఒక వ్యక్తి మూడేళ్లలో రూ.300 కోట్లు సంపాదిస్తాడు. ఇది 'తల్లీకొడుకుల అభివృద్ధి నమూనా'తోనే సాధ్యం. మనం ఇప్పటివరకు 2జీ కుంభకోణం గురించి విన్నాం. ఇప్పుడు జిజాజీ (బావ.. వధేరా) కుంభకోణం గురించి వింటున్నాం. మరి దేశాన్ని వాళ్ల చేతుల్లోకి వదిలేద్దామా?' అని ప్రశ్నించారు.

గుజరాత్‌లో మహిళా భద్రత గురించి రాహుల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, మహిళలపై నేరాలు జరుగుతున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏడు కాంగ్రెస్ పాలనలోనివేనని నరేంద్ర మోడీ దెప్పిపొడిచారు. 'అన్ని చేతులతో దోపిడీ చెయ్యి. ఒక్క మాటా నిజం చెప్పకు' అంటూ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. దేశ సమస్యల పరిష్కారం గురించే 24 గంటలూ ఆలోచిస్తున్నానన్నారు.

వెబ్దునియా పై చదవండి