చంద్రశిలల పరిశోధకుడు - త్రిపురనేని కమల్

గురువారం, 14 ఫిబ్రవరి 2008 (12:44 IST)
WD PhotoPTI
చంద్రునిపై కాలుమోపాలనే కాదు...అక్కడే కాపురం పెట్టాలని ఎందరో ఉవ్విళ్ళూరుతున్న రోజులివి. అంతరిక్ష శాస్త్రవేత్తలేకాదు పర్యాటకులు కూడా చంద్రమండల ప్రయాణం కడుతున్నారు. కానీ అక్కడి ప్రధాన సమస్య ఆక్సీజన్ కొరత. దీనిని తీర్చేందుకు ఓ నవ యువ శాస్త్రవేత్త త్రిపురనేని కమల్, రాళ్ళ నుంచి ఆక్సీజన్ తయారీలో పీహెచ్‌డి చేస్తున్నాడు. బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన కమల్ అంతరిక్షంలో మరిన్ని అద్భుతాలు జరుగుతాయని చెపుతున్నాడు.

తెలుగు సాహితీ వేత్త అయిన త్రిపురనేని గోపీచంద్ మనవడే ఈ కమల్. తాత సాహితీ పరిశోధకుడుగా పేరొందితే మనవడు అంతరిక్ష పరిశోధకుడుగా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడు. మెటల్ ఆక్సైడ్ నుంచి ఆక్సీజన్ తయారుచేయడం కమల్ పరిశోధనాంశం. పది గ్రాముల టైటానియం ఆక్సైడ్ నుంచి నాలుగు గ్రాముల ఆక్సీజన్ ఉత్పత్తి చేయడంలో ఈయన పిహెచ్‌డి చేశారు. చంద్రమండలంపై ఉన్న రాళ్ళు మెటల్ ఆక్సయిడ్‌లే కావడంతో ఇక చంద్రునిపైనే ఆక్సీజన్ తయారుచేసుకోవచ్చని కమల్ వివరిస్తున్నాడు.

త్రిపురనేని కమల్ యువ అంతరిక్ష శాస్త్రవేత్తగా రాణిస్తుండటంతో పలు యూనివర్శిటీలు అభినందిస్తున్నాయి. కమల్ తన తల్లిదండ్రులు త్రిపురనేని రమేష్, రమాదేవిలను చిన్నతనంలోనే కోల్పోయాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత తన బంధువులను కలుసుకోవడానికి బ్రిటన్ నుంచి విజయవాడకు వచ్చాడు. అంతరిక్ష పరిశోధనల్లో కమల్ పరిశోధనలకు బంధుమిత్రులు అభినందనలు తెలుపారు. రానున్న కొన్ని సంవత్సరాలలో ఆక్సీజన్ ఉత్పత్తితో పరిశోధనలు కొత్త మలుపు తిరుగుతాయని కమల్ చెపుతున్నాడు. ఇక రానున్న రోజులలో ఎంచక్కా చంద్రునిపైకి హాలిడే ట్రిప్పులు కూడా వేయవచ్చు. కీపిట్ అప్ కమల్.

వెబ్దునియా పై చదవండి