కూలి పని పేరుతో కేసీఆర్ వసూళ్ళ దందా: తెదేపా ధ్వజం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు కూలి పని పేరుతో వసూళ్ళ దందాకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్‌లో డిసెంబర్ తొమ్మిదో తేదీన తెరాస నిర్వహించనున్న మహాగర్జన బహిరంగ సభకు ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు చెందిన ఫ్యాక్టరీ నుంచి ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు పెద్దఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

కూలి పని పేరుతో హైదారాబాద్ పరిసరాల్లోని ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తల నుంచి ముందస్తు ఒప్పందాలు చేసుకుని వసూళ్ల దందా చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస ఒక ఉద్యమ సంస్థగా కాకుండా వసూళ్ల పార్టీగా మారిందని ధ్వజమెత్తారు.

తెరాసతో పాటు ప్రజారాజ్యం పార్టీలు కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంస్థలుగా మారాయని ఆయన ఆరోపించారు. ఈ పార్టీల రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతిలోకి మారిపోయిందన్నారు.

వెబ్దునియా పై చదవండి