జగన్‌పై విశ్వసనీయత మరింత పెరుగుతుంది: విశ్లేషకులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనూహ్య నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ పెను సంచలనానికి దారి తీసింది. సొంత పార్టీ నేతలే కాకుండా, స్వపక్షం నేతలు కూడా ఇది ఊహించని పరిణామంగా అభివర్ణించారు. వైఎస్ కుటుంబాన్ని రెండు ముక్కలు చేసి వైఎస్.జగన్‌ను తన దారికి తెచ్చుకోవాలని ఎత్తు వేసిన కాంగ్రెస్ అధిష్టానానికి దిమ్మదిరిగి పోయేలా జగన్ సమాధానం ఇచ్చారని విపక్ష నేతలు అంటున్నారు. హైకమాండ్ వేసిన ఎత్తుకంటే.. జగన్ ప్రయోగించిన రాజీనామా అస్త్రంతో కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంటోంది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా, సొంత పార్టీలో జగన్ వంటి ప్రజాకర్షక నేత లేరని ప్రతి ఒక్కరూ చెప్పుతున్నారు. ఇలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అదేసమయంలో ప్రజల్లో జగన్‌పై విశ్వసనీయత మరింత పెరుగుతుందన్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం ఈ తరహా అభిప్రాయాలను వెల్లడించడం గమనార్హం.

ముందునుంచి అనుకున్నట్టుగానే చెప్పిన మాటకు కట్టుబడి జగన్ నడుచుకుంటున్నాడని వారు గుర్తు చేశారు. దీనిద్వారా అధిష్టానం నుంచి ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురైనప్పటికీ.. ఆయన ఎదురొడ్డి నిలబడటమే కాకుండా ప్రజలకు అండగా నిలిచేందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేయడాన్ని ప్రజలు స్వాగతించడమే ఇందుకు నిదర్శనమని వారు గుర్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి