పార్టీ ఆదేశిస్తే పులివెందులలో పోటీ చేస్తా: వైఎస్.వివేకానంద

అనుకున్నట్టుగానే వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో రాజకీయంగా చీలిక వచ్చింది. తన సోదరుని తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచేందుకు ససేమిరా అన్నారు. పైపెచ్చు.. తమ పార్టీ అధిష్టామైన కాంగ్రెస్ ఆదేశిస్తే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పులివెందుల స్థానంలోనే అబ్బాయ్‌తో అమితుమీ తేల్చుకునేందుకు బాబాయ్ వైఎస్.వివేకా సిద్ధమయ్యాడు.

పైపెచ్చు.. గత రెండు రోజులుగా నాలుగు రకాలుగా మాట్లాడిన వైఎస్.వివేకా మీడియా ముందు మాత్రం పూర్తిగా అధిష్టాన విధేయుడిగా మాట్లాడటం గమనార్హం. అంతేకాకుండా, తమ కుటుంబాన్ని చీల్చేందుకు అధిష్టానం ఎలాంటి కుట్ర పన్నలేదని ఆయన ప్రపంచానికి చెప్పేందుకు ప్రయత్నించారు.

ఏది ఏమైనా.. వైఎస్ఆర్ కుటుంబం రాజకీయంగా చీలిపోయిందని చెప్పొచ్చు. ఎపుడైతే.. జగన్ వెంట నడిచేందుకు తాను సిద్ధంగా లేనని, తన తుది రక్తపుబొట్టు వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించి జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు.

ముఖ్యంగా, కడప రాజకీయాలను శాసిస్తున్న వైఎస్ కుటుంబం ఇలా రెండుగా విడిపోవడం సగటు వైఎస్ఆర్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆయన పులివెందుల నుంచి పోటీకి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే.. ఈ స్థానంలోనే బాబాయ్-అబ్బాయ్‌లు తలపడే దృశ్యాలు మున్ముందు చూసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి