మంత్రివర్గంలో అసమ్మతి చిచ్చు: కిరణ్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష!

రాష్ట్రమంత్రి వర్గంలో అసమ్మతి కొలిమి రాజుకుంది. బుధవారం ఉదయం పది గంటలకు మంత్రులుగా 39 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రానికి మంత్రులకు శాఖలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెనువెంటనే మంత్రుల అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. సీనియర్లకు ప్రాధాన్యంలేని శాఖల కేటాయింపును నిరసిస్తూ సీనియర్‌ మంత్రులు వట్టి వసంతకుమార్‌, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవులకు బుధవారం అర్థరాత్రి రాజీనామాలు చేశారు. వీటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల భాస్కర్‌కు పంపించారు.

ఇదేదారిలో మరికొందరు సీనియర్‌ మంత్రులైన ధర్మాన ప్రసాదరావు, జూపల్లి కృష్ణారావు, బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్‌, కన్నా లక్ష్మీనారాయణ, శత్రుచర్ల విజయరామరాజు, దామోదర రాజనర్శింహాలు కూడా రాజీనామా దిశగా ఆలోచన చేస్తున్నారు. వీరంతా బుధవారం అర్థరాత్రి నుంచి మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో అసంతృప్త మంత్రులను బుజ్జగించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సీఎం రంగంలోకి దింపారు.

అయినా అసంతృప్తులు మాత్రం ససేమిరా అంటున్నారు. సీనియర్ మంత్రి బొత్స అయితే, ఏకంగా ముఖ్యమంత్రికే ఫోన్ చేసి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మరికొంతమంది గురువారం సీఎంను కలిసి తమ రాజీనామాలను సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై మంత్రి రాజనర్శింహా నివాసంలో సమావేశమైన అసంతృప్తులు సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి