జగన్‌తో అసంతృప్తుల మంతనాలు: రంగంలోకి దిగిన పటేల్!

కడప ఎంపీ పదవికి రాజీనామా చేసిన తిరుగుబాటు నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో అసంతృప్తి మంత్రులు మంతనాలు జరుపుతున్నారని, వారు ఆయనతో భేటీకానున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు అధిష్టానానికి సమాచారం అందించారు. ఆ మరుక్షణమే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు.

మంత్రిశాఖల కేటాయింపులో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న వారిని బుజ్జగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అహ్మద్ పటేల్ అయితే స్వయంగా పలువురు సీనియర్ మంత్రులతో పాటు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తాజా పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం.

అంతేకాకుండా, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పలువురు సీనియర్ మంత్రులకు హితవు పలికారు. అదేసమయంలో అసంతృప్త మంత్రులను ఢిల్లీకి పిలిపించే అంశంపై వారు తర్జనభర్జనలు చెందుతున్నారు. వీలైనంత మేరకు హైదరాబాద్‌లో పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్ భావిస్తోంది.

అయినప్పటికీ.. తమ మాట వినని వారిని ఢిల్లీకి పిలిపించి శాంతింపజేయాలని అహ్మద్ పటేల్ భావిస్తున్నారు. ముఖ్యంగా, అసంతృప్తులతో పాటు రాష్ట్ర తాజా పరిస్థితులపై నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు అధిష్టానం రంగంలోకి దిగినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి