కిరణ్‌కు నాలుగు గంటల అవకాశం: అసంతృప్తుల అల్టిమేటం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సీటులో ఇంకా సర్దుకోకముందే మంత్రివర్గంలోని కొందరు అసంతృప్తులు అల్టిమేటం జారీ జేశారు. తమ శాఖల మార్పుపై నాలుగు గంటల్లో ఏదో ఒకటి తేల్చాలని వారు హెచ్చరించారు.

బుధవారం ఉదయం కిరణ్ మంత్రివర్గంలో 39 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అదేరోజు రాత్రి మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ కేటాయింపుపై అసంతృప్తి ఒక్కసారి భగ్గుమంది. రాత్రికి రాత్రి ఒక మంత్రి తన పదివితో పాటు.. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు మరికొందరు మంత్రులు తమ నిరసన గళం వినిపించారు. మంత్రి ధర్మాన నివాసంలో అసంతృప్త మంత్రులు సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులుగా ఉన్న తమకు అప్రాధాన్య శాఖలను కేటాయించారని వారు ఆరోపించారు.

తక్షణం తమ శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలని వారు పట్టుబట్టారు. ఇదే అంశంపై వారు ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు సైతం నిరాకరించారు. సీఎం స్వయంగా కలుగజేసుకుని తక్షణం శాఖల్లో మార్పులు చేయాలని కోరారు. ఇందుకోసం నాలుగు గంటల పాటు సమయం ఇస్తూ అల్టిమేటం జారీ చేశారు.

మంత్రి ధర్మాన నివాసంలో భేటీ అయిన వారిలో వట్టి వసంత్‌ కుమార్, బొత్స సత్యనారాయణ, జూపల్లి కృష్ణారావు, పొన్నాల లక్ష్మయ్య, అహ్మదుల్లా, ధర్మాన ప్రసాదరావు, విశ్వరూప్, దామోదర్ రాజనర్సింహ, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు.. 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరు మాత్రం శాఖల మార్పుపై తమ పట్టును ఏమాత్రం సడలించడం లేదు.

వెబ్దునియా పై చదవండి