ప్రస్తుతానికి పార్టీలోనే ఉంటా.. తర్వాత నీతో వస్తా: వైఎస్.వివేకా

శనివారం, 25 డిశెంబరు 2010 (16:53 IST)
ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, మంత్రిపదవికి రాజీనామా చేయబోనని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి తన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా, కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాట మేరకు మిగిలిన సభ్యులు రాజీనామా చేసేంత వరకు తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ మామ గంగిరెడ్డి నివాసంలో శనివారం భేటీ జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈచర్చలు కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నారు.

ఈ చర్చల అనంతరం వివేకానంద రెడ్డి, జగన్‌లు వారి ఇరువురి కుటుంబ సభ్యులందరూ కలిసి పులివెందులలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. వైఎస్ జగన్, వివేకానంద రెడ్డి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లేనని కింది స్థాయి నేతలు చెపుతున్నారు.

అయితే, ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ వెంటే ఉంటానని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తానని అంటూ వచ్చిన వివేకానంద రెడ్డి.. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాస్త మెతకపడినట్లు వినికిడి. ప్రస్తుతం కుదిరిన సయోధ్య మేరకు కడప పార్లమెంటు నియోజకవర్గానికి, పులివెందుల శాసససభా నియోజకవర్గానికి ఉప ఎన్నికలనాటికి రాజకీయంగా కూడా బలపడుతుందని అంటున్నారు.

అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేయబోయే కొత్త పార్టీలో కీలక పదవిని తనకు ఇవ్వాలని వివేకా కోరినట్టు వినికిడి. దీంతో పాటు.. కడప జిల్లాలో రాజకీయాలన్నీ పూర్తిగా తనకు వదిలి వేయడమే కాకుండా, అభ్యర్థుల ఎంపికలోనూ జోక్యం చేసుకోరాదని జగన్‌కు షరతు విధించినట్టు సమాచారం. వీటన్నింటికీ సమ్మతించిన జగన్.. బాబాయి‌తో సయోధ్య కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి