రైతుల మృతికి.. పంట నష్టానికి లింకు లేదు: సీఎం కేకేఆర్

శనివారం, 25 డిశెంబరు 2010 (17:46 IST)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతూరు కలికిరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలకు, పంట నష్టానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఈ రెండింటికి లింకు పెట్టి వార్తా కథనాలు రాయొద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. గుండెపోటుతో చనిపోతున్న వారిని కూడా ఆత్మహత్యలుగా చిత్రీకరించరాదన్నారు. మీడియా సంయమనంతో పాజిటివ్ కథనాలు రాయాలని కూడా ఆయన హితవు చెప్పారు.

ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి తొలిసారిగా శనివారం సొంత నియోజకవర్గమైన పీలేరులోని కలికిరి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయడంలేదన్న ప్రచారం వాస్తవంకాదన్నారు.

రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం రైతుల కోసం ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని తాను కూడా అనడంలేదని వివరణ ఇచ్చారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ మరింత పెంచాలని కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు.

రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్.సీ.ఐ. కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నాయని, వీటిపై కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి