జగన్మోహన్ చెంతకు ప్రజారాజ్యం నేత జ్యోతుల నెహ్రూ!

ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. జగన్ చేపట్టే కొత్త పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చిరంజీవి నిర్ణయించడాన్ని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.

చిరంజీవి నిర్ణయాన్ని నెహ్రూ బహిరంగ విమర్శించారు. అనంతరం ప్రరాపాకు గుడ్‌బై చెపుతున్నట్టు ప్రకటించారు. వైఎస్.జగన్ నాయకత్వంలో నడుస్తానని ప్రకటించారు. ఈ మేరకు జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో కలిసి ప్రాథమిక చర్చలు కూడా జరిపారు.

కార్యకర్తల కోరిక మేరకు జగన్ ఏర్పాటు చేయనున్న పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జగ్గంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. తనతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, సామర్లకోట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అత్తిలి సీతారామస్వామి తదితరులు కూడా చేరతారని జ్యోతుల వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి