చంద్రబాబుకు షాక్ : విజయమ్మకు ఫోన్ చేసిన మమత

FILE
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వై.ఎస్. విజయమ్మకు ఫోన్ చేశారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందని, కాంగ్రెసు, బిజెపియేతర ఏ ఫ్రంట్ అయినా సిద్ధమన్న సంకేతాలిచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ తగిలింది.

ఇటీవల జెడి(యు) ఎన్డీయే నుండి వైదొలిగిన అనంతరం మమత ఫెడరల్ ఫ్రంట్‌ను ముందుకు తీసుకు వచ్చారు. ఈ ఫ్రంట్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. అయితే ఫెడరల్, థర్డ్ ఏదనేది ముందు ముందు తేలనుందన్నారు. తద్వారా ఫెడరల్ ఫ్రంట్‌కు బాబు జై కొట్టారు.

అయితే ఇప్పుడు మమతా బెనర్జీ విజయమ్మకు ఫోన్ చేశారు. జాతీయ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, ఇతర పార్టీలతో కలిసి నడిచే అవకాశాన్ని పరిశీలిద్దామని ప్రతిపాదించారు.

నవంబరులో ముందస్తు అవకాశాలు లేకపోలేదని ఆమె విజయమ్మతో చెప్పారు. తన ప్రతిపాదనను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవాలని విజయమ్మను కోరారు. ఈ ప్రతిపాదనను జగన్ దృష్టి తీసుకువెళ్లేందుకు విజయమ్మ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి