వీరప్ప మొయిలీతో విజయశాంతి భేటీ: కాంగ్రెస్ తీర్థం ఎప్పుడూ...?!!

మంగళవారం, 20 ఆగస్టు 2013 (20:47 IST)
FILE
మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. విజయశాంతి తన స్థానం మెదక్ నుంచే తిరిగి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో అంగీకారం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగా టీఆర్ఎస్ నేతల రఘునందన్ రావు, చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో మంగళవారం సమావేశమైన అనంతరం వారు పార్టీలో చేరారు.

గతంలో మెదక్ ఎంపీ విజయశాంతితో పాటు.. టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేసిన రఘునందన్ రావు... ఇపుడు విజయశాంతితో కలిసి దిగ్విజయ్ సింగ్‌తో సమావేశం కావడం గమనార్హం. ఈ పరిణామమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎందుకంటే ఎంపీ విజయశాంతి ఇంట్లో పద్మాలయ స్టూడియో భూముల సెటిల్మెంట్ జరిగిందని, విజయశాంతి భర్త చేతుల మీదుగా రూ.80 లక్షల రూపాయలు చేతులు మారాయని రఘునందనరావు కొన్ని రోజుల క్రితం ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి