విభజిస్తే సీమాంధ్ర - తెలంగాణాల మధ్య నీటి యుద్ధాలు?

గురువారం, 22 ఆగస్టు 2013 (14:34 IST)
File
FILE
సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను రెండు ముక్కలు చేస్తే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు తప్పవా? ఖచ్చితంగా జరిగి తీరుతాయని ముఖ్యంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రం సమైక్యంగా ఉన్న సమయంలోనే ఈ రెండు ప్రాంతాల మధ్య నీటి సమస్యలు ఉన్నాయని రేపు విభజిస్తే పరిస్థితులు ఇంకా చేజారి పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఆయన బుధవారం సమావేశమై రాష్ట్ర విభజన వల్ల కలిగే లాభనష్టాలను వివరించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా సీఎం కిరణ్ అనేక ప్రశ్నలను సంధించినట్టు సమాచారం.

ప్రధానంగా, విభజనకు ముందు హైదరాబాద్, నదీజలాలు, విద్యుత్ సమస్య, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, రెవెన్యూ మొదలైన అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇప్పటికిప్పుడు విభజన జరిగితే తర్వాత సీమాంధ్ర ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందని హెచ్చరించారు.

రాష్ట్ర విభజన వల్ల ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా... మరిన్ని తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పునరుద్ఘాటించారు. విభజనకు సంబంధించి సీమాంధ్రుల్లో ఎన్నో భయాందోళనలున్నాయి. వాటిని తొలగించండి. తర్వాతే నిర్ణయం తీసుకోండి.

ఈ విషయం అంతకుముందు చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. ఈ సమస్యల గురించి ఆలోచించకుండా విభజన చేపట్టడం వల్ల లాభంలేదని ఆయన తేల్చి చెప్పినట్టు వినికిడి.

వెబ్దునియా పై చదవండి