సమైక్యాంధ్ర సభపై దాడి చేస్తాం : ఓయూ జేఏసీ వార్నింగ్

సోమవారం, 26 ఆగస్టు 2013 (09:10 IST)
File
FILE
హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ పెడితే ఖచ్చితంగా దాడి చేసి తీరుతామని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. అంతేకాకుండా, సమైక్యాంధ్రకు అనుమతి ఇస్తే తాము మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనన్నారు. లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇదే అంశంపై ఓయూ జేఏసీ నేతలు మాట్లాడుతూ పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నట్టు అర్థం. మేమూ అంతే. సహనం మాత్రమే ప్రదర్శిస్తున్నాం. అసమర్థులం కాదు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. తెలంగాణపై సీడబ్ల్యూసీ ప్రకటనలో తేడా వచ్చినా ఊరుకోం. మేం బయటకు వస్తే.. సచివాలయం, విద్యుత్ సౌధల్లో సీమాంధ్ర ఉద్యోగులు ఒక్కరు కూడా మిగలరు అంటూ ఓయూ జేఏసీ నాయకులు హెచ్చరించారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే మౌనంగా ఉంటున్నామని చెప్పారు. రెచ్చగొట్టి.. వచ్చే తెలంగాణను అడ్డుకునేందుకు సమైక్యవాదులు చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తామని, అదే సమయంలో పరిధి దాటి మాట్లాడితే ప్రాణాలకు తెగించి కొట్లాడుతామని తేల్చి చెప్పారు. వచ్చే నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించకపోతే.. ఓయూ జేఏసీ రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుందని వారు ప్రకటించారు.

ఇకపోతో సమైక్యాంధ్ర సభకు అనుమతిస్తే రణరంగం సృష్టిస్తాం. సభపై దాడి చేస్తాం. ఎల్‌బీ స్టేడియంలో సమైక్యాంధ్ర సభకు అనుమతిస్తే.. నిజాం కళాశాలలో మా మిలియన్ మార్చ్‌కూ ఒప్పుకోవాలి. ఇద్దరికీ అనుమతిస్తే తన్నుకోవడమే అని తేల్చి చెప్పారు. తమ హక్కులను కాలరాసే సమైక్య ఉద్యమంపైనే తమ పోరాటమని, వ్యక్తులపై కాదని వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి