జగన్ దీక్ష 2వ రోజు : చంచల్‌గూడ వద్ద భద్రత కట్టుదిట్టం!

సోమవారం, 26 ఆగస్టు 2013 (10:24 IST)
File
FILE
రాష్ట్ర విభజనకు నిరసనగా చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్ష సోమవారానికి రెండో రోజుకు చేరింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జగన్ దీక్షకు దిగారు. దీంతో ఆదివారమంతా జగన్ ఎలాంటి ఆహారం తీసుకోలేదని జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు.

అలాగే, సోమవారం ఉదయం కూడా జగన్ అల్పాహారం తీసుకునేందుకు నిరాకరించినట్టు జైలు అధికారులు తెలిపారు. అన్నపానీయాలు ముట్టకోకపోవడంతో వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని, 48 గంటలు గడిస్తేగానీ స్పష్టమైన విషయం వెల్లడించలేమని జైలు అధికారులు చెపుతున్నారు.

మరోవైపు దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు ఆయనను కోరే అవకాశం ఉంది. జైలు వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశముంది. మరోవైపు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్రజిల్లాలో పెద్దఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లెక్కుతున్నారు.

మరోవైపు.. జగన్‌కు మద్దతుగా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్న జైలు అధికారులు.. చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి