జగన్ కేసులో మంత్రి గీతారెడ్డికి సీబీఐ సమన్లు... ఇంట్లోనే విచారణ

FILE
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణలో భాగంగా రాష్ట్రమంత్రి గీతారెడ్డికి సీబీఐ సోమవారం సమన్లు జారీ చేసింది. లేపాక్షి హబ్ భూముల కేటాయింపు వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన గీతారెడ్డికి 70 నుంచి 80 ప్రశ్నలతో కూడుకున్న ప్రశ్నావళితో విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకుగాను ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. మంత్రి గీతారెడ్డిని విచారించేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఆమె ఇంట్లోనే విచారణ చేయాల్సిందిగా సూచించింది. దీంతో సీబీఐ రేపుకానీ, ఎల్లుండి కానీ గీతారెడ్డిని విచారించేందుకు సమాయత్తమవుతోంది.

కాగా లేపాక్షి హబ్ కేటాయింపు సమయంలో అక్కడ కంపెనీలు నెలకొల్పి నిరుద్యోగులకు లక్షా 50 వేల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐతే వాటన్నిటినీ తుంగలో తొక్కడమే కాకుండా లేపాక్షి హబ్ భూములను తనాఖా పెట్టి కోట్ల రూపాయలను తీసుకున్నారు.

అనంతరం అక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టకపోగా, జగతి, భారతి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ వాదిస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల అప్పటి రెవిన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావును విచారించిన సీబీఐ ప్రస్తుతం గీతారెడ్డిని విచారించేందుకు సమన్లు జారీ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి వెంకట రమణ జైలులో ఉన్నారు. మరి గీతారెడ్డి పరిస్థితి ఏంటో చూడాలి. ఇదిలావుండగా జగన్ ఆస్తుల కేసు విచారణ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు వచ్చే నెల 9వ తేదీ గడువు విధించింది. దీంతో సీబీఐ తన వేగాన్ని పెంచింది.

వెబ్దునియా పై చదవండి