టీడీపీ సీమాంధ్ర ఎంపీల దీక్ష భగ్నం : ఆస్పత్రికి తరలింపు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:10 IST)
File
FILE
పార్లమెంట్ ఆవరణలో టీడీపీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు చేపట్టిన దీక్షను ఢిల్లీ పోలీసులు సోమవారం అర్థరాత్రి భగ్నం చేశారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి, ముగ్గురు టీడీపీ లోక్‌సభ సభ్యులను ఇష్టం లేకున్నా ఆస్పత్రికి తరలించారు.

విభజన పేరుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌ వేదికగా నినదిస్తున్న టీడీపీ సీమాంధ్ర ఎంపీలు.. అన్ని రకాలుగా తమ గళం వినిపిస్తున్నారు. లోక్‌సభలో సస్పెన్షన్‌కు గురైన నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, కొనకళ్ల నారాయణ సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరాహార దీక్షకు దిగిన విషయం తెల్సిందే.

సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తమకు నిరసన తెలుపుకునే అవకాశం కల్పించాలని కోరినా... స్పీకర్‌ అందుకు సమ్మతించలేదని, అందుకే దీక్షకు దిగినట్టు వారు ప్రకటించారు. వీరికి సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు, కేంద్రమంత్రులు సంఘీభావం తెలిపారు. దీక్ష దగ్గర కూర్చుని మద్దతు తెలిపారు.

ఢిల్లీలోని వాతావరణంలో తీవ్రంగా ఉండడంతో.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎంపీలను డాక్టర్లు హెచ్చరించారు. అయినా వీరు లెక్క చేయలేదు. తమ నిరశన కొనసాగించారు. చివరకు మార్షల్స్‌ రంగంలోకిదిగి అంబులెన్స్‌లో ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి