ఆత్మహత్యలను ప్రేరేపించిన కేసీఆర్ : జైరాం రమేష్

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (12:13 IST)
File
FILE
టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫాంహౌస్‌లో కూర్చొని వేలాది మంది యువకుల ఆత్మహత్యలను కేసీఆర్ ప్రేరేపించాడని ఆయన ఆరోపించారు. బుధవారం నాగర్ కర్నూలులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.

ఉద్యమ సంఘాలు పిలుపునిచ్చినప్పుడు, ఉద్యమం ఉద్ధృతం అవుతున్నప్పుడు క్రెడిట్ తీసుకోవడం తప్ప కేసీఆర్ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని తేల్చేశారు. ఫాంహౌస్‌లో కూర్చుని విద్యార్థులు, అమాయకులు బలిదానాలు చేసేలా ప్రసంగాలు చేయడం తప్ప కేసీఆర్ చేసిందేమిటని నిలదీశారు.

తెలంగాణ కోసం కేసీఆర్ ఎలాంటి త్యాగం చేశారో చెప్పాలని ఆయన కోరారు. ఉద్యమం పేరు చెప్పి కోటీశ్వరుడైన కేసీఆర్‌కు అధికారం ఇస్తే, తన కుటుంబ ఎదుగుదల చూసుకుంటాడే తప్ప ఇంకేమీ ఉపయోగం లేదని అన్నారు. కేసీఆర్ పదవిలో ఉండగా తెలంగాణలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందిందో చెప్పాలని ఆయన సవాలు విసిరారు.

ఇద్దరు ఎంపీలు ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగితే గూర్ఖాలాండ్, బుందేల్‌ఖండ్ వంటి రాష్ట్రాలు ఎందుకు ఏర్పడలేదని అన్నారు. ఎవరు పడితే వారు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడం సాధ్యమా? అన్నది ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి