ఏదడిగినా బాలకృష్ణ అంటున్నారు!: హరికృష్ణ అసంతృప్తి

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (15:54 IST)
File
FILE
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు పైన ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ఏ సీటు అడిగినా దానిని తన సోదరుడు, హీరో బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నట్టుగా సమాధానమిచ్చారంటూ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని హరికృష్ణ కూడా బుధవారం మీడియా ముందు చెప్పారు.

ముఖ్యంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని కోరితే.. తాను ఏ స్థానమైతే కోరానో... ఆ స్థానాన్ని బాలకృష్ణకు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారంటూ ఎన్టీఆర్ తనయుడైన హరికృష్ణ వెల్లడించారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టీడీపీ సీటు కేటాయించకపోవడంపై నందమూరి హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీటు కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పారు. తొలుత పెనమలూరు స్థానాన్ని ఇవ్వాలని చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడే అడిగానని... ఆ స్థానాన్ని బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నట్టు అప్పుడు చెప్పారన్నారు.

ఆ తర్వాత జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో వీలైతే హిందూపురం శాసనసభ స్థానాన్ని కేటాయించాలని అడిగానని... అప్పుడు కూడా హిందూపురంపై బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నారని చెప్పారని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసిన తనకు ఏదో ఒక సీటు కేటాయిస్తారని ఆశించానని, కానీ తనకు మొండి చేయి చూపించారని హరికృష్ణ వాపోయారు.

వెబ్దునియా పై చదవండి