సన్యాసం తీసుకో : కేసీఆర్‌పై విజయశాంతి, పొన్నాల ఫైర్

గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:47 IST)
File
FILE
ఇచ్చిన మాట మీద నిలబడని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజకీయ సన్యాసం స్వీకరించి తన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని మెదక్ కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి విజయశాంతి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలు సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ మాట తప్పారని ఆమె అన్నారు. మాట తప్పడం కెసిఆర్ నైజమని ఆమె అన్నారు.

ఇదే అంశంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాను మెదక్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రజల కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా తెరాస సీనియర్ నేతలు హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి అడ్డుకున్నారని విమర్శించారు.

వీధి దీపాలు, నీటి మోటార్లు ఏర్పాటుకు విడుదల చేసిన నిధులను ఆ నాయకులు స్వాహా చేశారని ఆరోపించారు. తాను తెలంగాణ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నానని, నిన్న కాక మొన్న పుట్టిన తెరాస తెలంగాణ కోసం పోరాటం చేశానని అనడం విడ్డూరమన్నారు.

సోనియా వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని అంటున్న కేసీఆర్‌కే పాపం తగులుతుందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణల్లో ఒక్కదానికైనా క్లీన్‌చిట్ లభించిందా అని ప్రశ్నించారు. ఆరోపణలకు కేసీఆర్ ఏనాడైనా సమాధానం ఇచ్చారా అని ఆయన అడిగారు. తనకు కొన్ని విషయాల్లో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని పొన్నాల గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి