పులివెందులలో జగన్.. విశాఖలో విజయమ్మ నామినేషన్స్

గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:37 IST)
File
FILE
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పులివెందులలో ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, విశాఖ లోక్‌సభ సీటుకు ఆయన తల్లి వైఎస్ విజయమ్మలు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. పులివెందుల శాసనసభ అభ్యర్థిగా జగన్ నామినేషన్ వేస్తున్న సమయంలో పులివెందుల పట్టణం జనసంద్రమైంది. జగన్ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పూల అంగళ్ల సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం జగన్ అభివాదం చేస్తూ అక్కడ నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరి పులివెందుల తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

అలాగే విజయమ్మ కూడా విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద జగన్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆయన వెంట భార్య వైఎస్. భారతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి