డబ్బుతో దొరికిపోయిన మాజీ మంత్రి సతీమణి... జగన్ పార్టీ ఇచ్చిందా?

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (15:30 IST)
FILE
జగన్ పార్టీ తరఫున మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీమంత్రి పార్థసారథి భార్య కమల గురువారం రాత్రి హైదరాబాద్‌లో రూ.45 లక్షలతో పోలీసుల తనిఖీల్లో దొరికిపోయిన సంగతి విదితమే. ఐతే కమల విజయవాడకు తీసుకెళుతున్న ఈ డబ్బు ఎక్కడిదని పోలీసులు ఆరా తీస్తే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు భావిస్తున్నారు. ఐతే ఆ డబ్బులకు తనవద్ద లెక్కలు ఉన్నాయని మాజీమంత్రి పార్థసారథి అంటున్నారు.

తన భార్యను నగదుతో అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై విజయవాడలో పార్థసారథి మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి రూ. 70 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చని ఉన్నదని తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసమే కార్పొరేట్ బ్యాంక్ నుంచి ఆ నగదును తన సతీమణి డ్రా చేసుకుని వస్తున్నారని వివరించారు.

మాజీ మంత్రి పార్ధసారథి సతీమణి కమల రూ.45 లక్షల తరలిస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమె ఈ డబ్బును ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వదిలిపెట్టారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కమల ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేయగా ఈ నగదు లభ్యమైంది. కాగా మాజీమంత్రి పార్ధసారథి మచిలీపట్నం లోక్ సభ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిన విషయమే.

వెబ్దునియా పై చదవండి