ఫ్యాను గుర్తుకు ఓటేస్తే మీ తలరాత మారుతుంది : జగన్

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (14:32 IST)
File
FILE
వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ప్రజల తలరాతను మారుతుందని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబులా తాను విశ్వసనీయలేని రాజకీయాలు చేయలేనన్నారు.

'దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు చాలామంది ముఖ్యమంత్రులున్నారు. ఆయన హఠాన్మరణం తర్వాత కొందరు ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పింది వైఎస్సార్ ఒక్కరేన్నారు.

పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే. అందుకే ఆయన మరణిస్తే వందలాది గుండెలు ఆగిపోయాయి. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.

అందుకే ఆ మహానేత ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే... ప్రజల చేయి నేరుగా వారి గుండెల మీదకు వెళ్తుంది. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని వారు నినదిస్తారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నాకు వారసత్వంగా ఏదైనా వచ్చిందీ అంటే అది ఒక్క విశ్వసనీయతే. అందుకే నేను చంద్రబాబులా అబద్ధాల హామీలు ఇవ్వను. చెప్పేదే చేస్తా... చేసేదే చెప్తా’ అని హామీ ఇచ్చారు.

టీడీపీ ఎంపీలు విభజనకు అనుకూలంగా ఓటు వేశారని, రాష్ట్ర విభజనలో చంద్రబాబు కూడా భాగస్వామేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత అంటే అర్థం తెలీదని జగన్ అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అన్నీ ఉచితంగా ఇస్తానని చెబుతున్నారని, అయినా ఆల్ ఫ్రీ బాబు అధికారంలోకి రావడం కల్ల అని జగన్ జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి