ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది : నరేంద్ర మోడీ

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (15:43 IST)
File
FILE
తెలంగాణ మేం ఇచ్చాం.. మేం తెచ్చాం అని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు చెప్పుకుంటున్నాయని, కానీ నిజానికి తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఆత్మ బలిదానాలేనని భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చందని కాదని ఆయన చెప్పారు. నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ... తెలంగాణ ప్రజలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటన్నారు. గతంలో సోనియా కుటుంబం తెలంగాణ బిడ్డ పీవీని అవమానించిందన్నారు. ఎవరి సంస్కరణల వల్ల దేశం నిలబడిందో ఆయనను గౌరవించాలని కాంగ్రెస్ లేదన్నారు. ఇక ఇక్కడి నాటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లో అవమానించారని గుర్తు చేసారు. దేశానికి ప్రధానిగా సేవలు అందించిన పీవీకి గాంధీ కుటుంబం కనీసం నివాళులు కూడా అర్పించలేదని మోడీ విమర్శించారు.

కాంగ్రెస్ చరిత్రను చూస్తే ఆ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా అన్నారు. తెలంగాణ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే ఇక్కడ అడుగుపెట్టానని, వందల మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేద్దామా? అని, అలాంటి పాపత్ములున్న పార్టీకి ఓటేసి గెలిపిద్దామా? అని ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

ఇకపోతే... తెలంగాణను చిన్న శిశువుతో ఆయన పోల్చుతూ, ఆ శిశువును బాగా పెంచి పెద్ద చేసేవాళ్ళ చేతుల్లో పెట్టాలని, అది చాలా ముఖ్యమని అన్నారు. ఆ బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ చేతిలో ఈ తెలంగాణ బాలుడిని పెడితే కాంగ్రెస్ ఆ బాలుడిని ఎదగనివ్వదన్నారు. కాంగ్రెస్ పార్టీ 1100 మంది బలిదానం చేసుకునేవరకూ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మితే దారుణంగా మోసపోతారని ఆయన హెచ్చరించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఎంతో కీలకమైనవని, వారి భవిష్యత్తు ఎలా వుండాలో నిర్ణయించకోవాల్సింది వారేనని నరేంద్ర మోడీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి