హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది : కిరణ్ రెడ్డి

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:58 IST)
File
FILE
రాష్ట్రం విడిపోవడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, జేఎస్పీ అధ్యక్షుడు ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం కలిసివుండటం వల్లే అనేక దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయని, అదే విడిపోవడం వల్ల ఇకపై పెట్టుబడులు రావన్నారు.

ఆయన హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల టర్నోవర్ 64 వేల కోట్లరూపాయలు ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నష్టాన్ని కల్గిస్తుందన్నారు.

కొంతమంది నాయకుల స్వార్థ రాజకీయాలు, వారి పదవికాంక్ష ప్రజల బతుకులను చిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విడగొట్టి నాయకులు రాక్షసానందాన్ని పొందుతున్నారని, అలాంటి నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ప్రజల మేలు కోసం రాష్ట్రం విభజన జరగలేదన్నారు. రాష్ట్రం విభజన జరిగితే సాగునీటి పరంగా తెలంగాణ ప్రాంతం నష్ట పోతుందని కరెంటు, విద్య, ఉద్యోగ సమస్యలు తలెత్తుతాయని.. గతంలో తాను అసెంబ్లీలో చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసమే విభజనపై కోర్టుకు వెళ్లామన్నారు.

వెబ్దునియా పై చదవండి