కాంగ్రెస్ కుట్రతోనే మా ఆస్తులపై సీబీఐ విచారణ... హరీష్‌ రావు ధ్వజం

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:57 IST)
WD
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇద్దరిపైనా అలాగే మెదక్ ఎంపీ విజయశాంతి ఆస్తులపైనా విచారణ చేయాలని బాలాజీ అనే న్యాయవాది వేసిన పిటీషన్ నేపధ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు, విజయశాంతిలపై ప్రైవేట్ ఫిర్యాదుకు స్పందించిన సీబీఐ కోర్టు ఈ మేరకు సీబీఐకు ఆదేశాలు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించాలని సూచించింది.

తెరాస చీఫ్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు వెనకేశారంటూ ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈ కేసు ఆయనకు గుదిబండలా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో కేసీఆర్ ధాటిని తట్టుకోలేకే సీబీఐతో కాంగ్రెస్ పార్టీ దాడులు చేయించాలని చూస్తోందని హరీష్ ఆరోపించారు. ప్రతిపక్షాలు దారికి రాకుంటే సిబిఐతో బెదిరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు. తెరాస అధికారంలోకిరావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు.

వెబ్దునియా పై చదవండి