ప్రపంచంలోని 66 దేశాలలో ఐటీ తెలుగు తేజం... సత్యం విదేశాలలో పనిచేసే సాఫ్ట్‌వేర్ నిపుణులలో దాదాపు 40 శాతం మందిని తెలుగునేల నుంచి అందించిన సత్యం ఇలా ప్రపంచ ఐటీ చిత్ర పటంలో క్రమంగా ఎదిగి ఒకనాడు ప్రపంచ ఐటీ రారాజు బిల్‌గేట్స్ సరసన కూర్చున్న మేటి సత్యం
తెలుగు యువతలో మనోధైర్యాన్ని నింపి... విదేశీ గడ్డపై తెలుగు యువత రాణించగలదనీ నిరూపించిన సంస్థ. యువతకు కాసుల వర్షం కురిపంచిన సత్యం... ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రాజధానిగా సైబరాబాదును ప్రపంచానికి చాటిచెప్పింది. దాదాపు 60 వేల కుటుంబాలకు... కూడు, గుడ్డ, నీడనిస్తూ... తెలుగు యువతకున్న మేధా సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఏకైక సత్యం సామ్రాజ్యాధినేత బైర్రాజు రామలింగరాజు...
తెలుగునాట ప్రతి కుటుంబం తమ అబ్బాయి/అమ్మాయి సత్యంలో ఉద్యోగం సాధిస్తే ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడేవారు. ఇంతటి ఘనకీర్తికి ఒకే ఒక్కడు బైర్రాజు రామలింగరాజు ( సత్యం రాజు). నేడు ఆయనను పలు పత్రికలు మోసగాడంటూ పతాక శీర్షికలలో ఎలుగెత్తుతున్నాయి. తూర్పారపడుతున్నాయి.
వ్యాపారంలో కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోవాలంటే లాభాలను ఎక్కువ చేసి చూపాల్సిందేనన్నది వ్యాపార వాస్తవం. ఈ మాటను చాలామంది వ్యాపారస్తులు అంగీకరించక తప్పదు. ఇది వ్యాపారానికే పరిమితం కాలేదు. లోతుగా విశ్లేషిస్తే... ప్రతి వ్యక్తిలోనూ ఈ నైజం కనబడుతుంది.
ఉదాహరణకు... ఏదైనా ఓ చిరు వ్యాపారివద్దకు వెళ్లి మీ వ్యాపారం ఎలా ఉందండీ.. అని అడిగితే.. "ఏదో అలా నడుస్తోంది" అని అదోరకంగా బదులిస్తాడు. అదే సదరు వ్యాపారి తన కుమారుని వివాహ సంబంధం విషయమై తన వ్యాపారంపై ఆరా తీస్తే... మరో విధంగా స్పందించడం సహజం. వధువు తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తనకు ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి లక్షల ఆస్తి ఉందనీ, తన కుమారుడు (పనీ పాట చేయకపోయినా...) ఏదో వెలగబెట్టుస్తున్నాడని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేస్తాడు.
ఇది చూసే.. మన పెద్దవారు.. "వంద అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమ"న్నారు. ఇది వ్యక్తికి చెందిన తత్వం... అనుకుంటే, సత్యం రాజు చేసింది వ్యాపారానికి చెందిన తత్వం అనుకోవచ్చుగా. 60 వేల కుటుంబాల అన్నార్తిని తీర్చడానికీ, సంస్థ అభివృద్ధికి ఆయన అనుసరించిన విధానాలు అవే కావొచ్చు. ఒకప్పుడు వాటికందరూ జేజేలు పలికే ఉండవచ్చు. తీరా సత్యం ప్రభ తిరగబడేసరికి... అన్ని వేళ్లూ రాజు వైపే చూపిస్తున్నాయి. దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సత్యం రాజు వ్యక్తిగతంగా ఏ ఒక్కరికీ హాని చేయలేదు. 60 వేల కుటుంబాలకు నీడనిచ్చారు. మరెంతోమందికి అన్నపానీయాలను అందిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి మోసగాడే అయితే...
నిత్య జీవితంలో అభివృద్ధి, అవసరాలకోసం అబద్ధాలాడే మనలోని వారిని ఏమందాం...?
ఓ మంచి కుటుంబానికి తమ బిడ్డ అల్లుడవ్వాలని, వంద అబద్ధాలాడే తల్లిదండ్రులనేమందాం...?
"గడ్డి" రూపంలో కోటానుకోట్లు మెక్కే... రాజకీయ అవినీతి కుబేరులను ఏమని పిలుద్దాం...?
ప్రజా సంక్షేమం పేరిట కోటానుకోట్లు కమిషన్లుగా స్వీకరించే రాజకీయనేతలను ఏమందాం..?